PM Modi: కామారెడ్డి ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా
ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.
కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కింద తక్షణ సాయంగా రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. గాయపడిన వారికి చికిత్స కోసం రూ. 50 వేలు ప్రకటించారు.
చిల్లర్గి ఘొల్లుమంది. అంబులెన్స్ నుంచి మృతదేహాలు దిగుతుంటే ఊరు ఊరంతా బోరున విలపించింది. త్వరగా వచ్చేస్తామంటూ వెళ్లినవాళ్లు విగతజీవులుగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. మొన్నటి వరకు తమతో కలిసి పనిపాటలకు వచ్చినవాళ్లు ఇక లేరంటే గ్రామస్తులు నమ్మలేకపోతున్నారు. ఒక రోడ్డు ప్రమాదం చిన్న ఊరు చిల్లర్గిలో పెను విషాదాన్ని నింపేసింది.
కామారెడ్డి జిల్లాలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను ఇవాళ గ్రామానికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో తొమ్మంది మంది చనిపోయారు. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పిట్లం మండలం చిల్లర్గి గ్రామస్తులు టాటా ఏస్ వాహనంలో దినకర్మకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం సమయంలో ఆటోలో.. పిల్లలు, మహిళలు సహా 22 మంది ప్రయాణిస్తున్నారు. ఎల్లారెడ్డి మండలం హాసంపల్లి వద్ద ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికులంతా ఎగిరి పడ్డారు.
ప్రమాదం జరిగిన ప్రాంతమంతా రక్తసిక్తమైంది. తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేశారు బాధితులు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు 8 మంది మృతి స్పాట్‌లో చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.