తెలంగాణకు సోలార్ బూస్ట్: రైతులకు 450 మెగావాట్ల విద్యుత్, 20 వేల పంపులు

PM-KUSUM పథకంలో భాగంగా తెలంగాణకు 450 మెగావాట్ల కొత్త సోలార్ ప్లాంట్లు, 20,000 వ్యవసాయ పంపులు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలును అశ్రద్ద చేస్తుందని విమర్శలు చేస్తూ.. 2026 నాటికి స్కీమ్ ముగిసిపోతుందన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.

తెలంగాణకు సోలార్ బూస్ట్: రైతులకు 450 మెగావాట్ల విద్యుత్, 20 వేల పంపులు
Kishan Reddy

Updated on: Jul 23, 2025 | 8:29 PM

రైతుల భవిష్యత్తు కోసం, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం.. సాగుకు సౌరశక్తే మార్గం అంటూ కేంద్ర గనుల, బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి కుశుమ్ యోజన (PM-KUSUM) ఫోకస్‌ను గుర్తు చేస్తూ తెలంగాణ రైతులకు భారీ ఊరట కలిగించే ప్రకటనను ఎక్స్ వేదికగా చేశారు.

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన ప్రకారం… వివిధ వ్యవసాయ భూముల్లో గ్రిడ్‌కి అనుసంధానమైన సోలార్ పవర్ ప్లాంట్లు, స్వతంత్రంగా పనిచేసే సౌర వ్యవసాయ పంపులు, గ్రిడ్‌తో అనుసంధానమైన సోలార్ పంపులను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు శక్తి భద్రత, నీటి భద్రత, ఆదాయ వృద్ధి, డీజిల్ ఆధారిత వ్యవసాయంపై ఆధారాన్ని తగ్గించడం, పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం వంటివి ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నట్టు” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణకు ప్రత్యేకంగా మరో 450 మెగావాట్ల సామర్థ్యం మంజూరు

ఈ సందర్భంగా కేంద్ర పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషికి కృతజ్ఞతలు తెలుపుతూ, “తెలంగాణకు అదనంగా 450 మెగావాట్ల డీసెంట్రలైజ్డ్ గ్రిడ్-కనెక్టెడ్ సోలార్ పవర్ ప్లాంట్లుకు ఆమోదం లభించిందని, అలాగే 20,000 సౌర వ్యవసాయ పంపులను కూడా మంజూరు చేశారు” అని కిషన్‌ రెడ్డి తెలిపారు.

తెలంగాణకు అపారంగా ఉన్న సౌరశక్తి సామర్థ్యాన్ని గుర్తు చేస్తూ కిషన్ రెడ్డి తెలంగాణ సర్కార్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. “2026తో స్కీమ్ ముగుస్తుంది. అయితే ఇప్పటివరకు తెలంగాణలో పలు ప్రాంతాల్లో అమలు శూన్యంగా ఉంది. దీనిని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాను. ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నది పూర్తి సత్యం” అని కిషన్ రెడ్డి విమర్శించారు.

PM-KUSUM స్కీమ్ కింద రైతులు తమ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని వ్యవసాయ పంపులకు స్వయం శక్తిని పొందవచ్చు. మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపించి ఆదాయం వనరుగా మార్చుకోవచ్చు. దీని ద్వారా డీజిల్ ఆధారిత పంపుల నుంచి విముక్తి లభిస్తుంది. పర్యావరణానికి మేలు చేకూరుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.