హైదరాబాద్ లోని భారత్ బయో టెక్ డెవలప్ చేసిన ‘నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్’ తొలిదశ క్లినికల్ ట్రయల్స్ ఈ సిటీలోని కొన్ని కేంద్రాల్లో (ఆస్పత్రుల్లో) బుధవారం ప్రారంభమైంది. ఈ ట్రయల్స్ లో 10 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. హైదరాబాద్ తో బాటు పాట్నా, చెన్నై, నాగ పూర్ నగరాల్లో కూడా ఈ ట్రయల్స్ నిర్వహించడానికి ఈ సంస్థ సమాయత్తమైంది. ఈ ట్రయల్స్ కి సంబంధించి చెన్నైలోని ట్రయల్ సెంటర్ కి ఎథిక్స్ కమిటీ నుంచి ఆమోదం లభించగా, నాగ పూర్ సెంటర్ కి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించాల్సి ఉంది. ఇండియాలో నిర్వహించే మొదటి దశ ట్రయల్స్ లో 175 మంది వలంటీర్లు పాల్గొనవచ్చునని తెలుస్తోంది. తమ మొదటి రెండో దశ ట్రయల్స్ కోసం భారత్ బయో టెక్ సంస్థ ఇదివరకే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతిని కోరింది.అయితే ఇటీవలే తొలి దశ పరీక్షలకు అనుమతి లభించింది. ముక్కులోకి స్ప్రే చేయగలిగే ఈ వ్యాక్సిన్ ని అమెరికాలోని ‘ఆల్టిమ్యూన్’ అనే సంస్థ కూడా అభివృద్ధి చేస్తున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది.
కోవిడ్ ట్రాన్స్ మిషన్ ని…. ముఖ్యంగా పిల్లల్లో దీన్ని నివారించడంలో ఇది బాగా పని చేస్తుందని అంటున్నారు. వలంటీర్లకు తొలి డోసు ఇచ్చిన అనంతరం 42 రోజుల్లో దీని ఫలితాలపై తాత్కాలిక విశ్లేషణను భారత్ బయోటెక్ చేపడుతుంది. తాము ఉత్పత్తి చేస్తున్న కొవాగ్జిన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ 82 శాతం సత్తా కలిగినదని ఈ సంస్థ ప్రకటించింది. ఇప్పుడు నాసల్ వ్యాక్సిన్ పై దృష్టి పెట్టామని, ఇది కూడా నాణ్యమైనదని భావిస్తున్నామని ఈ సంస్థ వెల్లడించింది. దీన్ని ‘బీబీవీ 154’ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అని కూడా వ్యవహరిస్తున్నారు. ఇది గేమ్ ఛేంజర్ అని, ఇంజెక్షన్ లా కాకుండా దీన్ని నేరుగా ముక్కు లోకి స్ప్రే చేయవచ్చునని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే ఎవరికి వారు తామే దీన్ని తీసుకోవచ్చు.
మరిన్ని చదవండి ఇక్కడ :
పాలు పట్టుకొచ్చిన సంరక్షకులు… పరుగెత్తుకొచ్చిన ఏనుగులు… చూస్తుండగానే..