ఖర్మ ఖర్మ.. టికెటొచ్చినా ఇదేం టెన్షన్‌.. కలిసిరాని నేతలతో సిట్టింగ్‌కి కష్టకాలం

ఆ ఎమ్మెల్యేకే మళ్ళీ సీట్ కన్ఫర్మ్ అయింది. ఇంకేం మరీ హ్యాపీగా ప్రచారం చేసుకోవచ్చంటున్నారా. అక్కడంత లేదు. ప్రచారం చేస్తున్నా మనసు మనసులో లేదు. క్షణక్షణం టెన్షన్‌ పడుతున్నారా ఎమ్మెల్యే. ఎప్పుడేం జరుగుతోందోనన్న అనుమానం ఆయన్ని పట్టి పీడిస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎందుకాయనికి అంత టెన్షన్‌? ఫుల్ డీటేల్స్ తెలుసుకుందాం...

ఖర్మ ఖర్మ.. టికెటొచ్చినా ఇదేం టెన్షన్‌.. కలిసిరాని నేతలతో సిట్టింగ్‌కి కష్టకాలం
Gudem Mahipal Reddy

Updated on: Oct 14, 2023 | 6:24 PM

టికెట్‌ ప్రకటించాక రెట్టించిన ఉత్సాహంతో ఉండాల్సిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెగ టెన్షన్‌ పడుతున్నారట. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే అధినేత మళ్ళీ టికెట్ ఖరారు చేసినా సొంత పార్టీ నేతల నుంచి సహకారం కరువైందట. విచిత్రమేంటంటే టికెట్‌ ఎనౌన్స్‌ అయి ఇన్నిరోజులైనా, ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనా పటాన్‌చెరులో ఆశావహుల ప్రయత్నాలు మాత్రం ఆగడంలేదు. దీంతో ఇదెక్కడి గోలని కిందామీదా పడుతున్నారట ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి.

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏ అభ్యర్థికీ లేని కష్టాలు పటాన్‌చెరు ఎమ్మెల్యేకి ఎదురవుతున్నాయి. సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేస్తుంటే ఎలా సముదాయించాలో తెలీడంలేదట ఎమ్మెల్యేకి. పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ టికెట్‌కోసం నీలం మధు కూడా పోటీపడ్డారు. టికెట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిన మధు.. ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టుకున్నారంటున్నారు ఆయన అనుచరులు. కానీ చివరికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే టికెట్‌ ప్రకటించినా నీలం మధు తగ్గేదే లేదంటున్నారు. టికెట్‌ ప్రకటన తర్వాత నియోజకవర్గంలో మధు ఇంకాస్త స్పీడ్‌ పెంచటం మహిపాల్‌రెడ్డికి తల్నొప్పిగా మారింది. నీలం మధుకే టికెట్ ఇవ్వాలని నియోజకవర్గ వ్యాప్తంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ఉన్నారు ఆయన అనుచరులు.

పార్టీ పెద్దలు బుజ్జగించే ప్రయత్నం చేసినా టికెట్‌ విషయంలో పంతం వీడటం లేదట నీలం మధు. ముదిరాజ్‌లకు బీఆర్‌ఎస్‌ ఒక్క టికెట్‌ కూడా ఇవ్వకపోవటంతో తన సామాజికవర్గం మద్దతు కూడగట్టుకుంటున్నారాయన. పార్టీపై నమ్మకం ఉందంటూనే 16వ తేదీదాకా వేచిచూస్తానంటున్నారు నీలం మధు. అప్పటికీ అధినాయకత్వం స్పందించకపోతే వేరే పార్టీ లేదంటే ఇండిపెండెంట్‌గానైనా పోటీలో ఉంటానని చెబుతున్నారు. ముదిరాజ్‌ నేత పెట్టిన డెడ్‌లైన్‌పై బీఆర్‌ఎస్‌ పార్టీలో చర్చ జరుగుతోంది. కీలక సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావటం, మాస్ ఫాలోయింగ్ ఉండటంతో మధు విషయంలో ఎమ్మెల్యే వర్గం కాస్త టెన్షన్‌తోనే ఉందంటున్నారు.

నీలం మధుకి పార్టీలోనే కొందరు నేతలు మద్దతిస్తుండటంతో ఎమ్మెల్యే శిబిరంలో గుబులు మొదలైంది. మధు పార్టీ వీడితే ఆయన వెంట కొందరు నేతలు వెళ్లే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ టికెట్‌కోసం గట్టి పోటీ ఉందని తెలిసినా.. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, నీలం మధు విషయంలో నాయకత్వం అలర్ట్‌గా లేకపోవడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందంటున్నాయట పార్టీ శ్రేణులు. నేతలు చీలిపోవడానికి ఎమ్మెల్యే వ్యవహారశైలే కారణమంటున్నారు కొందరు. పటాన్‌చెరులో అసంతృప్తనేతను పార్టీ నాయకత్వం చివరికి బుజ్జగిస్తుందా లేదంటే ఆయన తన దారి తాను చూసుకుంటారా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి

Follow Us