Telangana: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్యకు గుండెపోటు.. చికిత్స పొందుతూ మృతి!

పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూశారు. శనివారం(ఏప్రిల్ 12) తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య తుదిశ్వాస విడిచారు. దరిపల్లి రామయ్య.. కోటి మొక్కలు నాటి వనజీవి రామయ్యగా పేరు మార్చుకున్న మొక్కల ప్రేమికుడు.. జీవితాంతం మొక్కలు నాటి పేరు తెచ్చుకున్నారు. దాదాపు కోటికిపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు.

Telangana: పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, వనజీవి రామయ్యకు గుండెపోటు.. చికిత్స పొందుతూ మృతి!
Padma Shree Awardee Vanajeevi Ramaiah

Updated on: Apr 12, 2025 | 7:39 AM

పద్మశ్రీ వనజీవి రామయ్య(87) కన్నుమూశారు. శనివారం(ఏప్రిల్ 12) తెల్లవారుజామున గుండెపోటుతో రామయ్య తుదిశ్వాస విడిచారు. దరిపల్లి రామయ్య.. వృక్షో రక్షతి రక్షితః అన్న సిద్ధాంతాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించాడు. మొక్కలను బిడ్డలవలే పెంచారు. ఇంటిపేరునే వనజీవిగా మార్చుకొని కోట్లాది మొక్కలకు ప్రాణం పోశారు. జీవితాంతం మొక్కలు నాటి పేరు తెచ్చుకున్నారు. కోటికిపైగా మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయన సేవలకు గాను 2017లో కేంద్ర ప్రభుత్వం రామయ్యను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

పద్మశ్రీ వనజీవి రామయ్య కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈక్రమంలోనే ఖమ్మంలోని తన స్వగృహంలో ఈ ఉదయం మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రామయ్య స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామం. మొక్కల పట్ల ఆయనకు ఉన్న ప్రేమతో.. మొక్కల ప్రాధాన్యం తెలిపే బోర్డులను తాను అలంకరించుకొని నిత్యం పర్యావరణ పరిరక్షణకు పాటుపడ్డారు.

50 ఏళ్లుగా అలుపెరగకుండా విత్తనాలు చల్లుతూ మొక్కలు పెంచేందుకు ప్రయత్నించారు. వేసవిలో విత్తనాలు సేకరించి తొలకరి రాగానే వాటిని ఆయా ప్రాంతాల్లో చల్లుతుండేవారు వనజీవి రామయ్య. ఇలా 120 రకాల మొక్కల చరిత్రను అలవోకగా చెప్పగలరు వనజీవి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆరో తరగతిలో వనజీవి గురించి పాఠ్యాంశంలో చేర్చింది. మూడు కోట్ల మొక్కలు నాటాలన్నదే తన లక్ష్యమని వనజీవి రామయ్య చెప్తుండేవారు. రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..