TRS vs BJP: రైతాంగానికి ఎవరేం చేశారో చర్చకు సిద్దమా.. బీజేపీ నేతలకు ఎర్రబెల్లి సవాల్!
Errabelli Dayakar Rao: రైతులను రెచ్చగొట్టడం తప్పితే.. కేంద్ర ప్రభుత్వం చేసింది ఏం లేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు.
Minister Errabelli on Paddy Procurement: రైతుల(Farmers)ను రెచ్చగొట్టడం తప్పితే.. కేంద్ర ప్రభుత్వం(Union Government) చేసింది ఏం లేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్(Piyush Goyal) అవమానించే రీతిలో మాట్లాడుతున్నారని.. ఆయన వ్యాఖ్యలు మూర్ఖంగా ఉన్నాయని విమర్శించారు. బీజేపీ తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని ఎర్రబెల్లి ప్రశ్నించారు. దమ్ముంటే.. హైదరాబాద్‌లో చర్చ పెడుదాం అని.. రైతాంగం కోసం బీజేపీ, టీఆర్ఎస్ ఏం చేశారనేది తేల్చుకుందాం అని ఆయన సవాల్ చేశారు. మాకన్నా ఎక్కువ బీజేపీ తెలంగాణకు చేసి ఉంటే మేం దేనికైనా సిద్ధమే అన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరిసిస్తూ.. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ప్రజలను అవమానపరిచేలా మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నేతలకు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గు లేకుండా కేంద్రానికి వంత పాడే ధోరణిని మానుకోవాలని ఎర్రబెల్లి సూచించారు. తెలంగాణ నుంచి నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి వైభవం తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. ఇంజినీర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారంటే కేసీఆర్ తీసుకుంటున్న రైతు సంక్షేమ విధానాలే కారణమన్నారు. పట్టణాల నుంచి పల్లెలకు ప్రజలు వలసపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్రం రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదు. మా నాన్న బతికుంటే కేసీఆర్ విధానాలతో బతికిన వ్యవసాయాన్ని చూసి సంతోషించే వారని దయాకర్ రావు గుర్తు చేశారు.
నూక బియ్యం మీరు తింటారో.. మేం తింటామో తేల్చుకుందాం అని ఎర్రబెల్లి ఛాలెంజ్ చేశారు. మేము రైతులకు చేసిన సాయంతో పోలిస్తే దాంట్లో పది పైసలు కూడా బీజేపీ రైతులకు ఏం చేయలేదని ఆయన విమర్శించారు. మేం రా రైస్ మాత్రమే కొంటామని కేంద్రం చెబుతుందని.. యాసంగిలో ‘ రా’ రైస్ ఎలా వస్తాయని ప్రశ్నించారు. వడ్లు కొంటామని చెప్పి రైతులతో వడ్లు వేయించారని.. కేసీఆర్ కొనమని చెబుతున్నా.. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు రైతులతో వరి వేయించారని ఆరోపించారు. గ్రామాల నుంచి బీజేపీ నాయకులను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వడ్లు కొనిపించే దాకా బీజేపీ నేతలను గ్రామాల్లో అడుగుపెట్టనివ్వొద్దని చెప్పారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు సిగ్గుండాలి. వ్యవసాయ చట్టాలపై రైతులు కేంద్రం మెడలు వంచినట్టే.. తెలంగాణ రైతులు కూడా ఏకమై ధాన్యం కొనేదాకా ఉద్యమిస్తారని ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు.