Telangana: అకాల వర్షాలతో అన్నదాత విలవిల.. కల్లాల్లో చేరిన నీరు.. తడిసి ముద్దైన ధాన్యం, నేలరాలిన మామిడి

|

May 17, 2022 | 6:54 AM

తెలంగాణలో అనేక జిల్లాలో అకాల వర్షాలు రైతులను నష్టాల పాల్జేశాయి. ఒక్క సారిగా ఈదురు గాలులు, వడగళ్ల వాన ధాన్యం రైతులన, మామిడి రైతులను నష్టపరిచాయి. మరోవైపు ఇళ్ల పై కప్పులు కొట్టుకుపోవడంతో పేద ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు.

Telangana: అకాల వర్షాలతో అన్నదాత విలవిల.. కల్లాల్లో చేరిన నీరు.. తడిసి ముద్దైన ధాన్యం, నేలరాలిన మామిడి
Telangana Rains
Follow us on

Telangana: తెలంగాణాలో విచిత్ర వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో పగలు ఎండలు దంచికొడుతున్నాయి.. రాత్రి సమయంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మహబూబ్ నగర్ , నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి  వంటి జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు అన్నదాత తీవ్రంగా నష్టపోయాడు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షంలో తడిచి ముద్దయింది. వివరాల్లోకి వెళ్తే..

మహబూబ్ నగర్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు రైతులను నష్టాల పాల్జేశాయి. ఒక్క సారిగా ఈదురు గాలులు, వడగళ్ల వాన ధాన్యం రైతులన, మామిడి రైతులను నష్టపరిచాయి. మరోవైపు ఇళ్ల పై కప్పులు కొట్టుకుపోవడంతో పేద ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. మిడ్జిల్ మండలంలో అకాల వర్షం, ఈదురు గాలులతో తీవ్ర నష్టం వాటిల్లింది. కొత్తూరు శివారులో సుమారు 30 ఎకరాల్లో కోతకు వచ్చిన వరిచేను నేకొరగగా, పలు గ్రామాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దైంది. పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంతో పాటు రోడ్డు పక్క ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షానికి కొట్టుకుపోయాయి. ఈదురు గాలులకు పలు చోట్ల కరెంటు స్థంభాలు, వైర్లు తెగిపడిపోవడంతో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. ఒక్కసారిగా గాలివాన రావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటికి పరుగులు తీశామని, రాత్రి ప్రభుత్వ హాస్టల్ తలదాచుకున్నామని, స్థానిక ఎంఎల్ఎ లక్ష్మారెడ్డి తక్షణ సహాయంగా పది వేల రూపాయలు అందజేశారని బాధితులు చెబుతున్నారు.

అకాల వర్షానికి ఈదురు గాలులకు భూత్పూరు, బాలనగర్, అమిస్తాపూర్ లో విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరిగాయి. అమిస్థాపూర్ లో ఈదురు గాలులకు భారీ వేపచెట్టు పడిపోవడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. దేవుడిరాయి వీధిలో వసురగా నాలు స్థంభాలు నేలకొరిగాయి. మామిడి కాయలు రాలిపోవడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం కలిగింది.  రైతులు తమ కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. 70 శాతం రైతుల ధాన్యం పొలాల్లోనే తడిసిపోయింది. ఐకెపి సెంటర్లో ధాన్యం తూకం వేసిన తర్వాత కూడా లోడ్ చేయకపోవడంతో అవి తడిసి ముద్దయ్యాయని, లోడ్ చేసేంత వరకు రైతుదే బాధ్యత అని చెప్పడంతో పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గాలివాన భీభత్సం సృష్టించింది. ఉరుములు మెరుపులతో తెల్లవారుజామున మూడు గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దైంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతన్నలు రోడ్డెక్కారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ పలు చోట్ల సొసైటీలకు తాళాలు వేసి నిరనస తెలిపారు రైతులు. అకాల వర్షం అపారనష్టాన్ని మిగిల్చింది.

ఉమ్మడి నిజామబాద్ జిల్లాలో కుండపోత వర్షం కురిసింది. 15 మండలాల పరిధిలో భారీ నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లా బీబీపేటలో 9 సెంటమీటర్ల వర్షం కురవగా.. అత్యల్పంగా నవీపేటలో 3 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైంది. జిల్లాలోని బిచ్కుంద, నాగిరెడ్డిపేట, ఆర్మూర్, జుక్కల్, ఎడపల్లి, దోమకొండ, నవీపేట, బాన్సువాడ మండలల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. కల్లాల్లో నీళ్లు చేరి.. రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. లింగపేట మండలం షట్పల్లి సంగారెడ్డిలో వర్ష భీభత్సానికి.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. వందల బస్తాల ధాన్యం తడిసిముద్దైంది. ఇందల్వాయి, సిరికొండ లో ధాన్యం కుప్పల్లో నీళ్లు చేరాయి. ఆర్మూర్ లో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. దోబీఘాట్ లో గంట పాటు ధర్నా చేశారు. మాక్లూర్ లోనూ రైతులు ధాన్యం కొనాలని ఆందోళనకు దిగారు. అమ్రాద్ సొసైటీకి తాళం వేసి నిరసన తెలిపారు. బీంగల్ మండలం సుదర్శన్ నగర్ తండాలో గిరిజన రైతులు రోడ్డెక్కి ఆందోళన చేశారు. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు….

రాత్రి కురిసిన ఊదురుగాలుల వర్షానికి బాన్సువాడ అతలాకుతలం అయ్యింది.  దుర్కి వద్ద బాన్సువాడ- బోధన్ ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఫలితంగా ట్రాఫిక్ అంతారాయం ఏర్పడింది. ఆర్మూర్ లో పిడుగులు పడ్డాయి. ఈఆర్ఓ కార్యాలయం పై పిడిగు పాటుతో.. అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయంలో 16 కంప్యూటర్లు, ప్రింటర్లు, పలు ఫైళ్లు కాలి బూడిదయ్యాయి. భారీ వర్షాలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు పలు టీంలు వర్ష ప్రభావిత గ్రామాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. జిల్లాలో రికార్డు స్దాయిలో వారం రోజులుగా ఎండలు దండికొడుతుండగా.. అర్దరాత్రి కురిసిన భారీ వర్షాలకు వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వర్షాలతో ధాన్యం తడిసిన రైతులకు న్యాయం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ ,కాటారం, మల్హర్, పలిమెల మండలాల్లో అకాల వర్షం కురిసింది. గాలి దుమారంతో కూడిన వాన పడటంతో పలు పంటలకు నష్టం వాటిల్లింది. వర్షంతో కొనగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. ధాన్యం కుప్పలు, ఆరబోసిన వడ్ల పక్కన వర్షపు నీరు నిలిచింది. వర్షం నుంచి రక్షణకు రైతులు వడ్లపై పరదాలు కప్పడానికి ప్రయత్నించగా గాలిదుమారంతో అవి ఎగిరిపోయాయి. పలిమెల మండలంలో గాలి దుమారానికి 3 ఇళ్ల పై వేసిన రేకులు ఎగిరిపోయాయి భారీగా నష్టం వాటిల్లినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..