Money-Doubling Scam: డబుల్ ధమాకా డబ్బుల స్కీం.. ఆశ చూపి రూ. 40 కోట్లతో జనానికి కుచ్చుటోపీ..!

అమాయక జనాలే ఆ కేటుగాళ్లకు టార్గెట్. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు ఇస్తామని అత్యాశ కల్పించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని నమ్మించారు. దీంతో పెట్టుబడులు పెట్టండి.. భారీగా ఆదాయం పొందండి అంటూ కేటుగాళ్లు విసిరిన వలలో వందల మంది చిక్కుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లాది రూపాయలను కుచ్చుటోపి పెట్టారు.

Money-Doubling Scam: డబుల్ ధమాకా డబ్బుల స్కీం.. ఆశ చూపి రూ. 40 కోట్లతో జనానికి కుచ్చుటోపీ..!
Money Doubling Scam
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jul 10, 2024 | 8:36 PM

అమాయక జనాలే ఆ కేటుగాళ్లకు టార్గెట్. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని పెట్టిన పెట్టుబడి కంటే రెట్టింపు ఇస్తామని అత్యాశ కల్పించారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే లాభాలు ఎక్కువగా వస్తాయని నమ్మించారు. దీంతో పెట్టుబడులు పెట్టండి.. భారీగా ఆదాయం పొందండి అంటూ కేటుగాళ్లు విసిరిన వలలో వందల మంది చిక్కుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కోట్లాది రూపాయలను కుచ్చుటోపి పెట్టారు.

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఘరానా మోసగాడు డబుల్ ధమాకా డబ్బుల స్కీంతో ఏకంగా రూ40 కోట్లు కొల్లగొట్టాడు. చింతపల్లి మండలం మాల్ (గోడుకొండ్ల )వద్ద మదిని సంజయ్ రెడ్డి కుమారుడు మనీష్ రెడ్డి నాలుగేళ్ల క్రితం మనీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ట్రేడర్స్ పేరుతో ఆఫీస్ తెరిచాడు. వంద పెట్టుబడితో రూ. 2వందలు, వెయ్యి పెడితే రూ. 2 వేలు, పదివేలు పెడితే ఇరవై వేల రూపాయలు, రూ. లక్షతో రెండు లక్షల రూపాయలు అంటూ డబుల్ ధమాకా ఆశ చూపించాడు.

మొదట్లో పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు ఇచ్చి నమ్మించాడు. ఏకంగా గ్రామానికి చెందిన 10మంది ఏజెంట్లను పెట్టుకుని వారికి నెలకు రూ.16 వేల జీతం ఇస్తూ టార్గెట్ పెట్టుకున్నాడు. చింతపల్లి మండలంతోపాటు మర్రిగూడ, నాంపల్లి, యాచారం, ఇబ్రహీంపట్నం, కరీంనగర్, నిజామాబాద్, చౌటుప్పల్, హైద్రాబాద్ వరకు విస్తరించాడు. దీంతో మనీష్ రెడ్డి మనీ ట్రాప్ లోకి సామాన్యులే కాదు ప్రభుత్వ ఉద్యోగులు కూడా చేరిపోయారు.

ఆశ అన్ని మరిచేలా చేస్తుంది. వేలు లక్షలు పెట్టుబడి పెట్టారు. అందరికీ ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చాడు. వందలాది మంది నుండి సుమారు రూ.40 కోట్లు కొల్లగొట్టాడు. కొంతకాలం కొందరికి ఇంటికి, వాహనాలకు లోన్లు ఇస్తానని నమ్మించాడు. ఆ తరువాత ఇదిగో అదిగో అంటూ కాలం వెళ్లదీసిన మనీష్ రెడ్డి 7 నెలలుగా వడ్డీ చెల్లించకుండా బోర్డు తిప్పేశాడు. మనీష్ రెడ్డి బాధితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, లెక్చరర్లు, స్టూడెంట్స్ ఉన్నారు.

గ్రామానికి దూరంగా ఉంటూ బాధితులనుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు మనీష్ రెడ్డి. చాలామంది బాధితులు అత్యాశతో బంధువుల నుంచి అప్పుగా తీసుకొచ్చి లక్షల రూపాయలు మనీష్ రెడ్డి చేతులో పోశారు. కొద్ది రోజులుగా ఫోన్ స్విచాఫ్ చేయడంతో బాధితులకు అనుమానం కలిగింది. డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ మనిష్ రెడ్డి పై బాధితులు ఒత్తిడి పెంచారు. రెట్టింపు డబ్బులు దేవుడెరుగు తాము పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇవ్వాలంటూ బాధితులు కోరుతున్నారు. పిల్లలు అవసరాల కోసం డబ్బులు వస్తాయని అత్యాశతో ఏజెంట్లతో మనిష్ రెడ్డి వద్ద పెట్టుబడి పెట్టామని బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరుతున్నారు.

మాల్ గ్రామానికి మనీష్ రెడ్డి వచ్చాడని తెలుసుకున్న బాధితులు తమ పెట్టుబడి డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. వడ్డీ ఇవ్వకున్నా పర్వాలేదు అసలైనా ఇవ్వమని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నా దగ్గర రూపాయి కూడా లేదు జైల్లో పెట్టుకుంటారా, చంపేస్తారా చంపేయండి అంటూ మొండికేశాడు. దీంతో తానే పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కాడు మనిష్ రెడ్డి. గ్రామస్తుల వేధింపులు భరించలేక పోతున్నానంటూ పోలీసులకు మొర పెట్టుకున్నాడు. కేసు నమోదు చేసి జైలుకు పంపాలని మనీష్ రెడ్డి స్వయంగా పోలీసులను ఆశ్రయించాడు. స్టాక్ మార్కెట్ పేరుతో మునిశ్ రెడ్డి మోసం చేశాడంటూ చాలామంది బాధితులు తమను ఆశ్రయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న విచారణ జరుపుతున్నామని చెబుతున్నారు. స్వల్పకాలంలో తక్కువ పెట్టుబడితో అధిక మొత్తం ఇస్తానని చెప్పేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలా ఎవరైనా మోసం చేసే ప్రయత్నం చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు..

ఈ కేసులో కొసమెరుపు ఏమిటంటే కొందరు రూ. లక్ష నుండి రూ. 10లక్షలు పెట్టుబడి పెడితే, ఒక ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ సహా ఓ బ్యాంక్ క్యాషియర్ రూ. 60లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. డబుల్ ధమాకా పేరుతో సామాన్యులను మోసం చేసిన మనిశ్ రెడ్డి.. https://99.com లో బెట్టింగ్ పెట్టి ఐదు కోట్ల రూపాయలు కోల్పోయినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో ఈ కేటుగాడు ఎన్ని కోట్లు కొల్లగొట్టాడో తేలనుంది. ఈజీ మనీ కోసం అత్యాశ పడకూడదని, ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తున్నాయి. బి కేర్ ఫుల్.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…