AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MiM in Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం..! ఓవైసీ రూట్‌మ్యాప్‌ సిద్ధమైందా..?

ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అలియాస్‌ ఎంఐఎం పార్టీ తీసుకున్న నిర్ణయం మరింత సంచలనం రేపుతోంది.

MiM in Maharashtra: మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం..! ఓవైసీ రూట్‌మ్యాప్‌ సిద్ధమైందా..?
Asaduddin Owaisi, Akbaruddin Owaisi
Balaraju Goud
|

Updated on: Oct 23, 2024 | 7:53 PM

Share

మహారాష్ట్ర ఎన్నికలకు మోగిన నగారా… పక్క రాష్ట్రాల్లో బాగా శబ్ధం చేస్తోంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో ఆ ముచ్చట బలంగా వినిపిస్తోంది. మొన్నటి దాకా బీఆర్‌ఎస్‌ వైఖరి ఏంటనే చర్చ జరగగా… ఇప్పుడు ఆ లిస్టులో మరో పార్టీ చేరింది. అంతేకాదు, అక్కడ పోటీచేయడానికి ఆ పార్టీ ఆసక్తి చూపుతుండటం చర్చనీయాంశంగా మారింది.

మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకి దారితీసిన వేళ.. ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అలియాస్‌ ఎంఐఎం పార్టీ తీసుకున్న నిర్ణయం మరింత సంచలనం రేపుతోంది. ఇప్పటికే పలురాష్ట్రాల ఎన్నికల్లో పోటీచేస్తూ చెప్పుకోదగిన ఓట్లు సాధిస్తూ.. మెల్లమెల్లగా విస్తరించే ప్రయత్నం చేస్తున్న మజ్లిస్‌, ఇప్పుడు మహారాష్ట్రలోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఈసారి కీలకమైన స్థానాల్లో పోటీచేసి గెలవడం ద్వారా… అక్కడి అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తోంది.

ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికలపై దారూస్సలాం.. ఒక రూట్‌ మ్యాప్‌ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పొలిటికల్‌ నిర్ణయాలపై ఓ వైపు చర్చిస్తూనే.. మరోవైపు అగ్రనేత అసద్‌ ప్రచారషెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసుకుంటోందట మజ్లిస్‌ పార్టీ. ముస్లిం ఓటు బ్యాంకు భారీగా ఉన్నచోట సొంతంగా పోటీచేయడమో.. లేక భావసారూప్య పార్టీలతో పొత్తుకు వెళ్లడమో.. చేయాలని నిర్ణయించిందట. అయితే, పొత్తుల విషయంలో కాంగ్రెస్‌పై ఆశలు పెట్టుకున్న మజ్లిస్‌కు… ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు కనిపించడం లేదు. తెలంగాణలో ఎంఐఎం తమ దోస్తే అంటున్న కాంగ్రెస్ పార్టీ… పక్కనే ఉన్న మహారాష్ట్రలో మాత్రం ఆ మాట చెప్పలేకపోతోందట. శివసేన, ఎన్సీపీలతో కూటమిగా ఉన్న కాంగ్రెస్‌.. వ్యూహాత్మకంగా ఎంఐఎంను దూరం పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో, హస్తంతో పొత్తు కుదిరేలా లేదని… అక్కడి చిన్నాచితక పార్టీలవైపు పతంగ్‌ పార్టీ మొగ్గుచూపిస్తున్నట్టు తెలుస్తోంది. పలు పార్టీలతో అసద్‌ చర్చలు కూడా జరిపినట్టు సమాచారం.

గతంలో ముంబై కార్పొరేషన్‌ ఎన్నికల్లో… ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి ప్రభావం చూపే ప్రయత్నం చేసిన ఎంఐఎం.. ఎంతో కొంత ఓటుబ్యాంక్‌ను సాధించింది. అయితే, ఈసారి ఎంట్రీ భారీగా ఉండాలని ప్లాన్‌ చేస్తున్న ఎంఐఎం.. అందుకు తగినట్టు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. అధ్యక్షుడు అసద్‌ కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా సమయం గడుపుతూ.. స్థానిక నేతలతో ఎప్పటికప్పుడు మంతనాలు జరుపుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..