హోమ్ ఓటింగ్‌కు ఏప్రిల్ 22 లోపు అర్హులు(85 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులు) దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఓటర్లకు సూచించారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. దీనికి సంబంధించి ఫారం-డీ పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్‌వో వద్ద పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ ఉంటుందని వివరించారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వేళ 2.09 లక్షల మంది పోస్టల్, హోమ్ ఓటింగ్‌ను వినియోగించుకున్నట్లు చెప్పారు. చంచల్‌గూడలో ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ జరుగుతుందని సీఈవో వివరించారు.
రాష్ట్రంలో 85 ఏళ్లు దాటిన వృద్ధులు 1.85 లక్షల మంది, దివ్యాంగ ఓటర్లు 5.26 లక్షల మంది.. టోటల్‌గా ఓటర్లు 3.30లక్షల ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 90,365 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత 3, 4 రోజుల్లో హోమ్ ఓటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు సీఈవో. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ కూడా పూర్తయిందని తెలిపారు వికాస్‌రాజ్.
ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు సీఈవో వికాస్‌రాజ్. కోడ్ అమలులో ఉన్న సమయం కనుక ఎవరూ కూడా 50 వేల రూపాయలకు మించి ఎక్కువ నగదు తీసుకెళ్తే సంబంధిత అధికారులకు పత్రాలు చూపించాల్సి ఉంటుందన్నారు. రాజకీయ పార్టీలు ర్యాలీలు, సభలకు అనుమతి సువిదా యాప్ ద్వారా తీసుకోవాలన్నారు. రోడ్‌షోలు సెలవు రోజుల్లోనే చేసుకోవాలన్నారు.. రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్‌షోలకు అనుమతి లేదని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ లు వాడటానికి లేదని.. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను, స్కూల్ డ్రెస్ లతో అనుమతి లేదని చెప్పారు. ఈసారి కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా పోస్టల్ ఓటింగ్ ఉంటుందన్నారు. C-విజిల్ యాప్ లేదా 1950కి ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. అలాగే షెడ్యూల్ ప్రకారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని తెలిపారు వికాస్‌రాజ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..