
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు లక్ష్యంగా పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. నెల రోజుల పాటు చేపట్టిన ‘ఆపరేషన్ స్మైల్- XII’ కార్యక్రమం ద్వారా మొత్తం 5,582 మంది చిన్నారులకు విముక్తి కల్పించినట్లు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకత్వంలో జనవరి 1 నుంచి 31 వరకు కొనసాగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా 121 సబ్ డివిజనల్ పోలీసు బృందాలు పాల్గొన్నాయి. ఇందులో మొత్తం 605 మంది పోలీసు సిబ్బంది పనిచేశారు. ఈ ఆపరేషన్‌లో మహిళా శిశు సంక్షేమ, కార్మిక, ఆరోగ్య శాఖలతో పాటు చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో వ్యవహరించినట్లు ఆమె పేర్కొన్నారు.
డిసెంబరు 29న నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో జువైనల్ జస్టిస్ యాక్ట్, బాల కార్మిక నిరోధక చట్టాలపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, అనంతరం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇటుక బట్టీలు, మెకానిక్ షాపులు, టీ స్టాళ్ల వంటి ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్ ద్వారా రక్షించిన వారిలో 5,108 మంది బాలురు, 474 మంది బాలికలు ఉన్నారని అదనపు డీజీపీ వివరించారు. వీరిలో 2,292 మంది బీహార్, ఉత్తర్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సహా సుమారు 15 రాష్ట్రాలకు చెందిన వారని చారుసిన్హా వెల్లడించారు. పొరుగు దేశమైన నేపాల్‌కు చెందిన 43 మంది చిన్నారులను కూడా రక్షించినట్లు తెలిపారు. రక్షించిన వారిలో 4,567 మంది బాల కార్మికులుగా, 486 మంది వీధి బాలలుగా, 38 మంది భిక్షాటన చేస్తూ, మరో 491 మంది ఇతర పనుల్లో మగ్గుతూ గుర్తించామని ఆమె పేర్కొన్నారు.
చిన్నారులతో పనులు చేయిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించామని, ఈ క్రమంలో 1,480 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసి 1,483 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు అదనపు డీజీపీ చారుసిన్హా వివరించారు. అలాగే కార్మిక శాఖ ద్వారా 1,363 తనిఖీ నివేదికలు జారీ చేసి, కనీస వేతనాల చట్టం కింద నిందితులకు రూ. 41.78 లక్షల జరిమానా విధించామన్నారు. రక్షించిన వారిలో 4,978 మంది చిన్నారులను వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చామని, ఆశ్రయం లేని 604 మందిని రక్షణ గృహాలకు తరలించామన్నారు. వలస కార్మికుల పిల్లల కోసం 29 అర్బన్ బ్రిడ్జ్ స్కూళ్లలో 2,375 మందిని చేర్పించామని అదనపు డిజిపి వివరించారు. రాష్ట్రంలో బాలల అక్రమ రవాణా, వెట్టిచాకిరిని నిర్మూలించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ అంకితభావంతో శ్రమిస్తుందని ఈ సందర్భంగా అడిషనల్ అదనపు డీజీపీ చారుసిన్హా పునరుద్ఘాటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..