
రోజురోజుకి కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు కొనలేని పరిస్థితి నెలకొంది. టమాటా, పచ్చిమిర్చినే కాదు.. వంకాయ, కాకరకాయ, బెండకాయ, దొండకాయ, సొరకాయ వంటి కూరగాయలు కేజీ 60 రూపాయలపైనే ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో కూరగాయల వ్యాపారి ఎస్ కే గౌస్.. ఔదార్యం చాటుతున్నాడు.
టమాటా, పచ్చిమిర్చి మినహా మిగిలిన కూరగాయలు కేజీ 20 రూపాయలకే అమ్మకాలు చేస్తున్నాడు. ఇల్లందులో బెండకాయ, వంకాయ, కాకరకాయ, దొండకాయ మార్కెట్‌లో కేజీ 60 రూపాయలు దాటింది. ఈ నేపథ్యంలో పేద, సామాన్య ప్రజలకు భారం లేకుండా టమాటా, పచ్చిమిర్చి మినహా.. మిగిలిన కూరగాయలు కేజీ 20 రూపాయలకే అమ్ముతున్నాడు. ఇదే అదునుగా వినియోగ దారులు ఎగబడి కూరగాయలు కొంటున్నారు.
ప్రస్తుత పరిస్థితులలో కూరగాయల రేట్లు అధికంగా ఉండడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని కొనుగోలు చేసే పరిస్థితిలో లేని నిరుపేదలకు ఉపయోగపడుతుంది కదా అనే ఆలోచనతో కూరగాయలు రేట్లు తగ్గే వరకు.. వాటి మీద ఎటువంటి లాభం లేకుండా అమ్మకాలు చేస్తున్నానని గౌస్ అంటున్నారు. ప్రజలు ఇబ్బంది లేకుండా. తక్కువ ధరకే కూరగాయలు అమ్ముతున్న గౌస్ ఔదార్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.