తెలంగాణ ఇంటర్ బోర్డు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. నాడు గ్లోబరీనా సంస్థ వాల్యూయేషన్‌తో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా..కొత్తగా ఆన్‌లైన్ వాల్యుయేషన్ విధానం ఇంటర్‌బోర్డులో కార్యదర్శి, లెక్చరర్స్ అసోసియేషన్ మధ్య చిచ్చురేపింది. రెండోరోజు కూడా పరస్పర ఆరోపణలతో రచ్చ కొనసాగింది. కేసుల దాకా వెళ్లిన వివాదం ఇంటర్ పరీక్షలపై ఎఫెక్ట్ పడుతుందా..?
తెలంగాణ ఇంటర్ బోర్డులో కార్యదర్శి వర్సెస్ లెక్చరర్స్ అసోసియేషన్ మధ్య వివాదం కంటిన్యూ అవుతోంది. పరీక్షలు జరగకముందే బోర్డు అధికారులు తీసుకున్న నిర్ణయంపై దుమారం రేగుతోంది. ఇంటర్ పరీక్షా పేపర్ల ఆన్‌లైన్ వాల్యుయేషన్ వివాదంతో బోర్డులో రచ్చ కొనసాగుతోంది. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. గతంలోనూ ఆయనపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. అక్రమాస్తుల వ్యవహారంలో ఏసీబీ దాడులు, అరెస్టు, జైలు జీవితం కూడా గడిపారు. దాంతో మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేశారు. అయినా జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం అధ్యక్షునిగా ఇంటర్ బోర్డులో చక్రం తిప్పుతున్నారు. ఇంటర్ బోర్డు అధికారులు కొత్తగా తీసుకొచ్చిన ఆన్‌లైన్ వాల్యూయేషన్‌ను మధుసూదన్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో ఇంటర్ బోర్డు ఆఫీసులో చొరబడటం, దొంగచాటుగా డేటాచోరీ చేయడం వంటి ఆరోపణలు రావడంతో బోర్డు అధికారి మధుసూదన్‌రెడ్డిపై బేగంబజార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
మరోవైపు మధుసూదన్‌రెడ్డిపై నిన్నటివరకూ ఇంటర్ బోర్డు సెక్రటరీగా ఉన్న నవీన్‌మిట్టల్ బహిరంగంగానే విమర్శలు చేశారు. ఎన్నో ఆరోపణలు ఉన్న వ్యక్తి తమపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. అక్రమ ఉపాధి పోతుందనే ఉద్దేశ్యంతోనే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
నవీన్‌మిట్టల్ ఆరోపణలపై.. తెలంగాణ ప్రభుత్వ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి స్పందించారు. బోర్డులో జరుగుతున్న అవకతవకలపై విద్యార్థుల తరఫున పోరాడుతున్నందుకే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నవీన్‌మిట్టల్ ఆర్థిక లావాదేవీల కోసమే బోగస్ కంపెనీకి ఆన్‌లైన్ వాల్యుయేషన్ కాంట్రాక్టు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి మాత్రం ఆన్‌లైన్ వాల్యూయేషన్ విధానాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపింది. తప్పుడు సమాచారంతో విద్యార్థులు నష్టపోతారని, ఆధారాలతో ఇబ్బందులు ఏంటో చెప్పాలి కానీ, మంచి పనికి అడ్డుపడటం సరికాదని స్పష్టం చేసింది. ఈనెలలో జరిగే ప్రాక్టీకల్ ఎగ్జామ్ ఇన్విజిలేషన్‌ను లెక్చరర్ల సంఘం బహిష్కరిస్తారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్‌పై ప్రభుత్వం జోక్యం చేసుకొని నిర్ణయం తీసుకోవాలని లెక్చరర్లు, విద్యార్థులు కోరుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..