Telaganana: ఒక్క ఛాన్స్ ప్లీజ్.. చట్టసభల్లో తడాఖా చూపిస్తామంటూ పోలీస్ బాస్‌లు..!

| Edited By: Balaraju Goud

Feb 26, 2024 | 3:11 PM

ఆ ఖాకీ బాస్ లకు ఖద్దర్ పై మోజు పెరిగింది.. ఒక్కఛాన్స్ ఇస్తేచాలు చట్ట సభల్లో మా తడాఖా చూపిస్తా మంటున్నారట. వారి మనసులోని మాట పార్టీ దూతల చెవిన వేసిన ఆ పోలిస్ అధికారులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పోలీస్ అధికారులే హాట్ టాపిక్ అయ్యారు. వారందరికీ ఆయనే స్ఫూర్తి. ఇంతకీ ఎవరా పోలీస్ అధికారులు..?

Telaganana: ఒక్క ఛాన్స్ ప్లీజ్.. చట్టసభల్లో తడాఖా చూపిస్తామంటూ పోలీస్ బాస్‌లు..!
Brs Bjp Congress
Follow us on

ఆ ఖాకీ బాస్ లకు ఖద్దర్ పై మోజు పెరిగింది.. ఒక్కఛాన్స్ ఇస్తేచాలు చట్ట సభల్లో మా తడాఖా చూపిస్తా మంటున్నారట. వారి మనసులోని మాట పార్టీ దూతల చెవిన వేసిన ఆ పోలిస్ అధికారులు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పోలీస్ అధికారులే హాట్ టాపిక్ అయ్యారు. వారందరికీ ఆయనే స్ఫూర్తి. ఇంతకీ ఎవరా పోలీస్ అధికారులు..? ఎక్కడి నుండి సమరానికి సై అంటున్నారు? అక్కడి నుండే ఎందుకు టిక్కెట్ ఆశిస్తున్నారో.. తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

పార్లమెంట్ ఎన్నికల వేల కొత్త ట్రెండ్ మొదలైంది. టికెట్ల వేటలో మునుపెన్నడూ లేని విధంగా పోలీస్ అధికారులు తెగ ఆరాట పడుతున్నారట. ఖాకీ డ్రెస్ వదిలి ఖద్దర్ చొక్కా ధరించాలని ఆరాటపడుతున్నారట. ఆ పోలీస్ ఉన్నతాధికారులకు పాలిటిక్స్‌ వైపు మనసు మళ్లింది. పార్లమెంట్‌లో అడుగు పెట్టాలని తెగ ఆరాట పడుతున్న వారికి.. రిజర్వేషన్లు కలిసి వస్తుండడంతో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ ఇప్పటికే పార్టీ అధినేతలకు అర్జీ పెట్టుకున్నా పోలీస్ అధికారులు. మనసులో మాట పార్టీ దూతల చెవినవేసిన వేశారట. అధినేతల నుంచి కబురు వస్తే చాలు కదనరంగంలోకి దిగేందుకు రెఢి అయ్యారట.

ఇప్పుడు అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. జనరల్ స్థానాల్లో ధనబలం.. ప్రజా బలం ఉన్న నేతలు ఇప్పటికే సమరానికి సిద్ధమయ్యారు. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీల్లో టిక్కెట్టు కోసం ఆశావాహులు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధిష్టానం ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. అయితే వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పోలీస్ అధికారులే హాట్ టాపిక్ అయ్యారు. టిక్కెట్ కోసం ఆరాపడుతున్న పోలీస్ బాస్‌లకు.. టిక్కెట్టు రేసులో పార్టీ శ్రేణుల నుండి విమర్శలు మూట కట్టుకుంటూ జనంలో మాత్రం చర్చగా మారారు.

ఇక రిజర్వుడ్ స్థానాల్లో మాత్రం బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పోలీస్ అధికారులు కొందరు టిక్కెట్ కోసం తెగ ఆరాట పడుతున్నారు. SC రిజర్వుడ్ వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి శోభన్ కుమార్ విపరీతంగా ప్రయత్నాలు చేస్తున్నారట. మల్టీ జోన్ IGగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుదీర్ బాబు కోసం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీ నుండి రిటైర్డ్ DIG కృష్ణ ప్రసాద్ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారట.

ఒకవైపు పోలీస్ అధికారులు టిక్కెట్ కోసం తెగ ఆరాట పడుతుంటే, మరో స్థానం నుండి జిల్లా రిజిస్ట్రార్ హరికొట్ల రవి టిక్కెట్ రేసులో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిసి టిక్కెట్ కోసం అర్జీ పెట్టుకున్న జిల్లా రిజిస్ట్రార్ వరంగల్ పార్లమెంట్ లో చర్చగా మారారు. కాంగ్రెస్ టిక్కెట్ కోసం వీరంతా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మరోవైపు ఇండియా కూటమిలో భాగంగా ఈ సీటు కమ్యూనిస్టులకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది.

ST రిజర్వుడ్ స్థానం మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంలోనూ ఇదే సీన్.. SP స్థాయి అధికారి నాగరాజు టిక్కెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. మరోవైపు CI కాశీరాం కూడా ఇదే స్థానం నుండి టిక్కెట్ రేసులో ఉన్నారట. అయితే టిక్కెట్ కోసం పోటీ పడుతున్న వీరందరికీ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, వర్దన్నపేట MLA కే ఆర్ నాగరాజే స్పూర్తి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా రిటైర్డ్ అయిన వెంటనే ఆయనకు అవకాశం తలుపు తట్టి MLA అయ్యారు. ఆయన్ను రోల్ మోడల్ గా తీసుకుని వీరంతా ప్రయత్నాలు చేస్తున్నారట.

టిక్కెట్ రేసులో పోలీస్ అధికారుల ఆరాటం చూసి జనం నివ్వేరపోతున్నారు. పార్టీ గెలుపు కోసం ఇంతకాలం శ్రమించిన ఆశావహులు ఇప్పుడు నోటికాడి బుక్క ఎవరు ఎగురేసుకుపోతారో అనే సందిగ్ధంలో తలలు పట్టుకుంటున్నారట. మరి పార్టీ పెద్దల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…