ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28 న ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో తానా సభ్యులు, కొందరు ఎన్నారై లు, పారిశ్రామిక వేత్తలు కలిసి సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించారు. 54 అడుగుల ఎత్తైనా భారీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరిగాయి. ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహంపై యాదవ సంఘాలు అభ్యంతరం తెలిపాయి. ఆందోళనలు చేయడంతో పాటు.. పలు హిందూ సంఘాలు, యాదవ సంఘాలు కోర్టు మెట్లు ఎక్కాయి. విచారించిన కోర్టు.. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై స్టే ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు విగ్రహం ఏర్పాటు చేయకూడదంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో విగ్రహ ఏర్పాటు నిలిచింది. మరోవైపు కోర్టు స్టే పై హర్షం వ్యక్తం చేశారు కరాటే కల్యాణి.
మరోవైపు కోర్టు ఉత్తర్వులు రావడంతో వెంటనే ఎన్నారైలు స్పందించారు. కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న అంశాలపై దృష్టి పెడతామంటున్నారు. మార్పులు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామన్నారు ఎన్నారై జై తాళ్లూరి. కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎన్నోచోట్ల పెట్టారని, ఎక్కడాలేని అభ్యంతరం ఖమ్మంలోనే ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అయితే.. ఎన్నారైలు అన్నట్టుగా మొత్తం విగ్రహాన్నే మార్చుతారా? ఎలాంటి మార్పులు చేస్తారు? మరో విగ్రహం తీసుకొస్తారా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. లేక కోర్టు ఫైనల్ తీర్పు వరకు వేచి చూస్తారా? అన్నది కూడా తెలియడం లేదు. మొత్తానికైతే ఈ నెల 28న జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా జరగాల్సిన విగ్రహావిష్కరణ మాత్రం వాయిదా పడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..