Khammam: ఉసూరుమంటున్న అన్నగారి ఫ్యాన్స్.. శతజయంతి వేళ ఊహించని ఆశాభంగం

|

May 26, 2023 | 4:49 PM

ఖమ్మం నడిబొడ్డున కొలువుతీరాలనుకున్న నందమూరి కృష్ణుడు.. వెనక్కు తగ్గేశాడు. కృష్ణ భగవానుడి రూపులో తీర్చిదిద్దిన ఎన్టీయార్ విగ్రహ ఏర్పాటుకు బ్రేకులు పడ్డాయి. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఉస్సూరుమంటున్నారు ఎన్టీయార్ అభిమాన కోటి. అటు ఖమ్మం లోకల్‌లో కూడా నిరాశా వాతావరణమే.

Khammam: ఉసూరుమంటున్న అన్నగారి ఫ్యాన్స్.. శతజయంతి వేళ ఊహించని ఆశాభంగం
Ntr Statue In Khammam
Follow us on

ఖమ్మం లకారం చెరువులో ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు బ్రేక్ పడింది. మొదట్లో యాదవ సామాజిక వర్గం నుంచి అభ్యంతరం… ఇప్పుడు కోర్టు నుంచి తిరస్కారం. ఎన్టీయార్ శతజయంతి వేళ.. అభిమానులకు ఇదొక ఆశాభంగం. తానా సౌజన్యంలో రూపొందిన 54 అడుగుల ఎన్టీయార్ కృష్ణావతార విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ భారత యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళా పీఠం, బహుజన జేఏసీ రిట్‌ పిటిషన్లు దాఖలు చేశాయి. జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టి… విగ్రహ ఏర్పాటుపై స్టే ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

విగ్రహానికి స్పల్ప మార్పులు చేసి.. ఆవిష్కరణ చేస్తామని నిర్వాహకులకు చెప్పినప్పటికీ కోర్టు అంగీకరించలేదు. లకారం ట్యాంక్‌బండ్‌పై విగ్రహ ఏర్పాటుకు అనుమతిస్తే.. చెరువు మధ్యలో ఎలా ఏర్పాటు చేస్తారు.. ఐనా చెరువులో విగ్రహ ఏర్పాటు మున్సిపల్‌, వాల్టా చట్టాలకు విరుద్ధం కదా… ఒక రాజకీయ నేత విగ్రహాన్ని దేవుడి రూపం ఎలా కడతారు… అంటూ అనేక అంశాల్ని ప్రస్తావిస్తూ నిలుపుదల ఉత్తర్వులిచ్చారు. తదుపరి విచారణ జూన్‌ 6న జరగనుంది.

నందమూరి వందేళ్ల పండగ సందర్భంగా తమ ఆరాధ్య నటుడ్ని, నాయకుడ్ని కృష్ణ భగవానుడి రూపంలో చూసుకోవాలన్న ఆశలు ఇప్పటికైతే గల్లంతే. మంత్రి పువ్వాడ అజయ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ముఖ్యఅతిథిగా జూనియర్ ఎన్టీయార్ వస్తారన్న వార్తలు.. ఇవన్నీ కలిసి ఖమ్మంలో కృష్ణావతారం ఎపిసోడ్ క్రేజీగా మారింది. ఇప్పుడా కార్యక్రమం నిరవధికంగా వాయిదా పడ్డంతో స్థానికంగా నిరాశా వాతావరణం నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం