Panchayat Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లోకి నోటా ఎంట్రీ.. అభ్యర్థుల గుండెల్లో ఇక వణుకే!

రాష్ట్రంలో లోకల్ పోరు ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థులు సమరం సాగిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తున్నారు. కానీ బ్యాలెట్ పేపర్ లోని ఓ సింబల్ అభ్యర్థులకు దడ పుట్టిస్తోంది. ఆ సింబల్ తో తమ రాతలు తలకిందులవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు అభ్యర్థులు. గెలుపోటములను ప్రభావితం చేసే ఆ సింబల్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Panchayat Elections: స్థానిక సంస్థల ఎన్నికల్లోకి నోటా ఎంట్రీ.. అభ్యర్థుల గుండెల్లో ఇక వణుకే!
Nota

Edited By: Anand T

Updated on: Dec 01, 2025 | 12:20 PM

ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే ఎవరో ఒక అభ్యర్థికి ఓటేయాల్సిందే.. ఇది కాలంగా వస్తున్న ఆచారం. అభ్యర్థులు నచ్చకపోయినా వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఎన్నికల్లో తమకు నచ్చనీ అభ్యర్థులు ఎవరూ లేరని చెప్పే విధానం లేకపోయింది. ఈ తంతు కొన్నేళ్లుగా సాగింది. కానీ దేశంలో తొలిసారిగా 2013లో జరిగన మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఓ ఆయుధాన్ని ఇచ్చింది. అభ్యర్థులు ఏవరూ నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించేందుకు పాశుపతాస్త్రం ఇచ్చింది. అభ్యర్థుల తలరాతలు తలకిందులు చేసే వజ్రాయుధమే .. నోటా. ఇప్పటివరకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనే నోటా ఉండగా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను ఎన్నికల కమిషన్ ప్రవేశ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను కూడా కల్పిత అభ్యర్థిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల్లో నోటాకు ప్రత్యేకంగా గుర్తును కేటాయిస్తోంది.

ప్రాధాన్యత సంతరించుకున్న నోటా.. ఇపుడు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుబులు పుట్టిస్తోంది. తమకు నచ్చని అభ్యర్థుల నుదుట చెమటలు పట్టించే సామాన్యుడి ఆయుధంగా ‘నోటా’ మారుతోంది. అనేక ఎన్నికల్లో ఉనికినీ చాటిన నోటా.. ఇప్పుడు అభ్యర్థులను మరింత కలవర పెడుతోంది. పలు ఎన్నికల్లో నోటా ఎందరో అభ్యర్థుల తలరాతలను తలకిందులు చేసింది. గతంతో పోల్చితే ‘నోటా’ పై ప్రజలకు అవగాహన బాగా పెరిగింది. సోషల్ మీడియా ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థులకు కేటాయించిన గుర్తులను ప్రస్తుతం నిరక్షరాస్యులు కూడా గుర్తు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ కింది వరసలో కనిపించే నోటాకు కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. పలు ఎన్నికల్లో నాలుగు, ఐదు స్థానాల్లో నోటాకు ఓట్లు నమోదయ్యాయి. దీంతో పంచాయితీ ఎన్నికల్లో నోటా కీలకంగా మారింది.

పంచాయతీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్లు మాత్రమే ఉంటాయి. అభ్యర్థులకు ప్రతి ఓటు కీలకంగా మారుతుంది. అనేకసార్లు పోటా పోటీ ఓట్లు రావడం, టై అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అందుకే అభ్యర్థులు సామ, దాన దండో పాయాలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యర్ధుల ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు అభ్యర్థులు వ్యూహరచన చేస్తున్నారు. రాజకీయ, ధన బలం కలిగిన అభ్యర్థులను కూడా ఎదుర్కొనేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కానీ ఈ నోటా రూపంలో ఉన్న కల్పిత అభ్యర్థి మాత్రం పంచాయతీ బరిలో నిలిచే అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నిరక్షరాస్యులు వేసే చాలా వరకు ఓట్లు చెల్లని (మురిగి)విగా నమోదవుతున్నాయి. చెల్లని ఓట్లు అభ్యర్థుల గెలుపోవటములను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెల్లని ఓట్లతో పాటు నోటా ఓట్లు ఎక్కడ తమ కొంప ముంచుతాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇప్పుడు నోటా పేరు చెబితేనే అభ్యర్థులు వణికి పోతున్నారు.

ఈసీ విడుదల చేసిన గుర్తుల్లో అభ్యర్థులకు కేటాయిస్తారు. ఆ గుర్తులు గ్రామీణ ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే సింబల్ రావాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు. కానీ కొన్ని గందరగోళమైన గుర్తులు వస్తే మాత్రం ఓట్లు తగ్గడంతో పాటు చెల్లని ఓట్లు, నోటాకు పడే ఓట్లు తమ గెలుపుకు ఆటంకంగా మారనుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో నోటాకు లభించే ఓట్లతో అభ్యర్థుల తలరాతలు తలకిందులు అయ్యే అవకాశం ఉంది. దీంతో పంచాయతీ ఎన్నికల్లో నోటా గెలుపోటములపై ప్రభావం చూపనుంది. నోటా’తో మామూలుగా ఉండదు మరి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.