బియ్యపు గింజలపై ‘ఓం నమో నరసింహాయ నమః’ జప మంత్రం.. భక్తిని చాటుకున్న యువతి..

2005లో గేయవర్షిణి తండ్రి శ్రీనివాస్‌ బియ్యం గింజలపై సూక్ష్మ అక్షరాలు రాసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తాను సాధించలేని లక్ష్యాన్ని తన కుమార్తెతో పూర్తిచేయడంతో శ్రీనివాస్‌ ఆనందం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక భావాలతో భగత్ ఆరాధన చేస్తున్న గేయవర్షణిని వేద పండితులు, భక్తులు అభినందిస్తున్నారు.

బియ్యపు గింజలపై ఓం నమో నరసింహాయ నమః జప మంత్రం.. భక్తిని చాటుకున్న యువతి..
Devotion On Rice Grains

Edited By:

Updated on: May 11, 2025 | 12:12 PM

తమ ఇలవేల్పుపై ఉన్న భక్తిని భక్తులు పలు రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. కొందరు టెంకాయలు కొడతారు.. మరికొందరు తలనీలాలు సమర్పిస్తారు. ఇంకొందరు ఉపవాసాలు ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం ఇష్టదైవం లక్ష్మినరసింహుడిపై తన భక్తిని మరో రకంగా చాటుకుంది. ‘ఓం నమో నరసింహాయ నమః’ అనే జప మంత్రాన్ని బియ్యపు గింజలపై నరసింహుడి నామాలు లిఖించింది.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగు తున్నాయి. కోరికలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు మట్టపల్లికి వస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన స్వామి వారి కళ్యాణం ఈనెల 11వ తేదీన అంగరంగ వైభవంగా జరిగింది. స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు స్వామి వారికి మొక్కులు, కానుకలు చెల్లించుకుంటారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం రెడ్డికాలనీకి చెందిన విద్యుత్ ఉద్యోగి గుంటూరు శ్రీనివాస్ – శ్రీలక్ష్మి దంపతుల కుమార్తె గేయవర్షణి సూక్ష్మ చేతిరాతలో ప్రావీణ్యాన్నీ సంపాదించింది. సూక్ష్మ చేతిరాత ప్రావీణ్యానికి భక్తి పారవశ్యం జోడించి 77రోజుల కఠోర దీక్షతో స్వామివారి జప మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో రాసింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో ఆదివారం జరిగిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణానికి 32,116 బియ్యం గింజలపై13 అక్షరాలతో జప మంత్రాన్ని లిఖించి తలంబ్రాలుగా సమర్పించింది. సాధారణ జెల్‌ పెన్నుతో స్వామివారి నామాన్ని బియ్యం గింజలపై రాసినట్లు గేయవర్షిణి తెలిపారు.

ఇవి కూడా చదవండి

గేయవర్షణికి చిన్నతనం నుంచి ఆధ్యాత్మికత, భక్తి భావం ఎక్కువ. ఇంటర్ పూర్తి చేసిన గేయవర్షిని సూక్ష్మ చేతిరాతపై ఆసక్తి పెంచుకుని తొలిప్రయత్నంలోనే జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహ ఆలయంలో ‘శ్రీ నరసింహ’ అనే ఆరు అక్షరాలను 12,116 బియ్యం గింజలపై లిఖించి తలంబ్రాలుగా స్వామివారికి సమర్పించింది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ అంతర్జాతీయ మైక్రో హ్యాండ్‌ రైటింగ్‌ అవార్డుకు గేయవర్షిణి ఎంపికైంది. 2024 డిసెంబర్‌లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతులమీదుగా ఢిల్లీలోని శాస్త్రీ భవన్‌లో ఈ అవార్డు అందుకున్నారు. గత ఏడాది వాడపల్లి నర్సింహస్వామి ఆలయానికి 12,116 బియ్యం గింజలపై స్వామివారి నామాన్ని లిఖించి తలంబ్రాలుగా సమర్పించి భక్తిని చాటుకుంది.

తాజాగా మట్టపల్లి ఆలయంలో ఆదివారం జరిగిన లక్ష్మీనృసింహుడి కల్యాణ మహోత్సవానికి స్వామివారి నామాన్ని రచించిన 32,116 బియ్యం గింజలను తలంబ్రాలుగా గేయవర్షిణి అందజేసింది. బియ్యపు గింజలపై ఓం నమో నరసింహాయ నమః’ జప మంత్రాన్ని రాసేందుకు మౌనదీక్షతో భక్తి కార్యాచరణ పూర్తిచేసినట్లు గేయవర్షిణి తెలిపారు. 2005లో గేయవర్షిణి తండ్రి శ్రీనివాస్‌ బియ్యం గింజలపై సూక్ష్మ అక్షరాలు రాసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తాను సాధించలేని లక్ష్యాన్ని తన కుమార్తెతో పూర్తిచేయడంతో శ్రీనివాస్‌ ఆనందం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆధ్యాత్మిక భావాలతో భగత్ ఆరాధన చేస్తున్న గేయవర్షణిని వేద పండితులు, భక్తులు అభినందిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us