Bus Fire: ఆ టీ బ్రేకే 29మంది ప్రయాణికులను కాపాడింది.. హైదరాబాద్‌కు వస్తుండగా మరో బస్సు ప్రమాదం..

తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరవక ముందే నల్లగొండ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఎలా బతికి బయటపడ్డారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

Bus Fire: ఆ టీ బ్రేకే 29మంది ప్రయాణికులను కాపాడింది.. హైదరాబాద్‌కు వస్తుండగా మరో బస్సు ప్రమాదం..
Bus Accident

Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 11, 2025 | 6:44 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదం మరువకముందే.. తాజాగా నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు శివారులో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విహారి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. అర్ధరాత్రి హైదరాబాద్ బీరంగూడ నుంచి ఏపీలోని నెల్లూరు జిల్లా కొండాపురానికి విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు NL 01 B 3250 బయలుదేరింది. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు వద్ద హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రాగానే బస్సు ఇంజన్ లో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన డ్రైవర్.. వెంటనే బస్సును పక్కకు ఆపాడు. బస్సులో మంటలు వ్యాపిస్తుండగానే కేకలు వేస్తూ ప్రయాణికులు బస్సు నుండి ప్రాణాలతో బయట పడ్డారు. బస్సు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని.. రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదం నుండి ప్రయాణికులు తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయట పడ్డారు.

అంతకు ముందు చౌటుప్పల్ శివారులో బస్సును టీ బ్రేక్ కోసం డ్రైవర్ బస్సును ఆపాడు. టీ బ్రేక్ నుంచి బయలు దేరిన 10 నిముషాలకే ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా బస్సులో పొగలు, మంటలు వ్యాపించాయి. టీ బ్రేక్ కోసం బస్సును అపడంతో ప్రయాణికులంతా నిద్రలోకి జారిపోకుండా మెలకువతో ఉన్నారు. దీంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే బస్సు నాన్ ఏసీ కావడం, కిటికీలు తెరచి ఉండటం, వెనుక డోర్ ఓపెన్ కావడంతో ప్రయాణికులు త్వరగా బస్సు నుండి బయటకు వచ్చారు. ఒకవేళ టీ బ్రేక్ తీసుకోకపోతే తెల్లవారుజామున కావడంతో అంతా గాఢ నిద్రలో ఉండేవాళ్లమని.. దీంతో పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు చెబుతున్నారు.

బస్సులో మంటలను ఆర్పడానికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని, ఫిట్ నెస్ లేని వాహనాలను రోడ్డు పై తిప్పడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరుచు జరుగుతున్నాయని ప్రయాణికులు వాపోయారు. తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ట్రావెల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.