నేరుగా కోర్టుకు నాగార్జున.. అసలు పరువు నష్టం కేసులో ఏం జరగబోతుంది..?

| Edited By: Balaraju Goud

Oct 05, 2024 | 8:13 PM

మంత్రి కొండా సురేఖ అభ్యంతర వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువస్తూ.. ఆమెపై నాగార్జున పరువు నష్టం దావా కింద పిటిషన్ దాఖలు చేశారు.

నేరుగా కోర్టుకు నాగార్జున.. అసలు పరువు నష్టం కేసులో ఏం జరగబోతుంది..?
Nagarjuna, Konda Surekha
Follow us on

అక్కినేని కుటుంబం, హీరోయిన్ సమంత, మాజీ మoత్రి కేటీఆర్ పై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యల దుమారం తారా స్థాయికి చేరుకునే విషయం తెలిసిందే..! తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ అభ్యంతర వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకువస్తూ.. ఆమెపై నాగార్జున పరువు నష్టం దావా కింద పిటిషన్ దాఖలు చేశారు. నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున పిటిషన్ పై శనివారం లేదా సోమవారం విచారణ జరగనుంది.

అయితే పరువు నష్టం దావా కేసులో పిటిషనర్ నేరుగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. పరువు నష్టం కేసులలో మొదట కోర్టులో పిటిషనర్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాల్సి ఉంది. దీంతో శనివారం లేదా సోమవారం నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హీరో నాగార్జున హాజరు అయ్యే అవకాశం ఉంది. నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పరిశీలించిన తర్వాత, అయన పిటిషన్‌లో పేర్కొన్న ఇద్దరు సాక్షులు సైతం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. వారి స్టేట్‌మెంట్‌లను సైతం మెజిస్ట్రేట్ రికార్డ్ చేస్తుంది. ఆ తర్వాత కోర్ట్ దానిని కాగ్నిజన్స్‌గా తీసుకుంటే మంత్రి కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేస్తుంది.

కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత కొండా సురేఖ నుండి కోర్టు వివరణ కోరుతుంది. ఆమె వివరణ ఆధారంగా ఒక్కోసారి నేరుగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. తదనంతరం కోర్టు ఈ పరువు నష్టం దావా కేసుకు సీసీ నంబర్‌ను కేటాయిస్తుంది. సీసీ నంబర్ వచ్చిన తర్వాత కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది. నాగార్జున వేసిన పిటిషన్ లో కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఎన్ఎస్ సెక్షన్ 356 నమోదు చేయాలని కోరారు. ఇంతకుముందు ఐపీసీలో 499, ఐపీసీ 500 కింద డిఫార్మషన్ కేసులు నమోదు అయ్యేవి. ఇప్పుడు ఐపీసీ కాస్త బి.ఎన్.ఎస్ గా మారడంతో సెక్షన్ 356 కింద కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని అక్కినేని నాగార్జున నాంపల్లి మనోరంజన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

నాగార్జున పిటిషన్ పై నాంపల్లి మనోరంజన్ కోర్ట్ విచారణ చేపట్టనుంది. గురువారం సాయంత్రం నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం దీనికి సంబంధించిన విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ, జడ్జి సెలవులో ఉన్న కారణంగా ఇంచార్జి జడ్జి ముందు పిటిషన్ విచారణకు రానుంది. శనివారం లేదా సోమవారం నాగార్జున పిటిషన్ పై విచారణ జరగనుంది. నాగార్జున తరఫున సీనియర్ అడ్వకేట్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు. స్టేట్‌మెంట్ రికార్డులో భాగంగా నాగార్జున కోర్టుకు రావాల్సి ఉంటుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..