
నాగర్‌కర్నూల్ జిల్లా బొందలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. మటన్ భోజనం చేస్తుండగా గొంతులో బొక్క ఇరుక్కోవడంతో ఊపిరాడక వృద్ధుడు మరణించాడు. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. బొందలపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కొత్త ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో మేస్త్రీలు, సన్నిహితుల కోసం దావత్ ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఇంటి పక్కనే నివసించే పోలేముని లక్ష్మయ్య అనే వృద్ధుడు కూడా హాజరయ్యారు.
విందులో భోజనం చేస్తుండగా లక్ష్మయ్య గొంతులో అకస్మాత్తుగా మటన్ బొక్క ఇరుక్కుపోయింది. ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడిన లక్ష్మయ్య అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇది గమనించిన తోటివారు హుటాహుటిన చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే దురదృష్టవశాత్తూ ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గమధ్యలోనే లక్ష్మయ్య ఊపిరాడక మృతి చెందారు. మటన్ ఎముక శ్వాసనాళంలో ఇరుక్కోవడమే మరణానికి ప్రధాన కారణం. అంతేకాకుండా భోజనం చేసే సమయంలో లక్ష్మయ్య మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త ఇల్లు పూర్తైందన్న సంతోషంలో ఏర్పాటు చేసుకున్న విందు ఇలా విషాదంగా ముగియడంతో బొందలపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..