
మూసీ పునరుజ్జీవానికి అవసరమైన కీలక నిధుల అంశంలో కూడా స్పష్టత వస్తోంది. ఈ ప్రాజెక్టుకు రుణం అందించేందుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (ఏడీబీ) అంగీకారం తెలిపినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మిగతా ప్రక్రియలు పూర్తయిన వెంటనే పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు అధిరారులు. మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్జాతీయంగా అమలులో ఉన్న నమూనాలను అధ్యయనం చేయడానికి రాష్ట్ర అధికారులను కొరియా, జపాన్ వంటి దేశాలకు పంపారు. భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా మూసీ పునరుజ్జీవాన్ని రాష్ట్ర అభివృద్ధి దృష్టికోణంలో కీలకంగా పరిగణిస్తున్నారు.
తొలి దశలో ఇక్కడి నుంచే ప్రారంభం
హెచ్‌ఎండీఏ పరిధిలో మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించగా, తొలి దశలో 9 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్‌ను ఈ నెలాఖరుకల్లా సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. డీపీఆర్ పూర్తయ్యాక ఆయా పనులకు అవసరమైన వ్యయ అంచనాలను అధికారులు రూపొందించి ప్రభుత్వానికి పంపనున్నారు.
తొలి దశలో లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్ ప్రాంతంలో ప్రత్యేక పనులు చేపట్టనున్నారు. మహాత్మా గాంధీకి సంబంధించిన భారీ విగ్రహం, ఆయన బోధనలను తెలియజేసే మ్యూజియం, వివిధ మతాల ప్రార్థనా మందిరాలు, మూసీ వెంట రవాణా సౌకర్యాలు కల్పించే రహదారి నిర్మాణం వంటి అంశాలు ఈ దశలో ఉన్నాయి. ఇవన్నీ డీపీఆర్‌లో చేర్చనున్నారు.
ఈ పనుల కోసం రక్షణ శాఖ పరిధిలోని దాదాపు 250 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ప్రైవేటు భవనాలను స్వాధీనం చేసుకుని, ప్రభావితులకు పునరావాసం కల్పించే అంశాలనూ ప్రణాళికలో భాగం చేస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించిన తర్వాత రుణ సేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించనున్నారు. తొలి దశ పనులకు సుమారు రూ.4,100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని రుణంగా అందించేందుకు ఏడీబీ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిన వెంటనే రుణ మంజూరు ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఫిబ్రవరి చివరి నాటికి రుణ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉండగా, ఆ తర్వాత టెండర్లను పిలిచే యోచనలో ఉన్నారు. అన్ని ప్రక్రియలు అనుకున్నట్లు సాగితే వచ్చే ఉగాది నాటికల్లా మూసీ పునరుజ్జీవం తొలి దశ పనులు ప్రారంభమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పనులను రెండేళ్ల వ్యవధిలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.