మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడదల జాతీయ పార్టీగా ఉప ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న టీఆర్ఎస్ ఆశలపై నీళ్లు చల్లిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయంటున్నారు. జాతీయ పార్టీగా మునుగోడు ఉపఎన్నిక బరిలో నిలవాలని టీఆర్ఎస్ భావించగా.. తాజాగా ఎన్నికల సంఘం మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాంతో టీఆర్ఎస్ ఆశలు అడియాశలైనట్లయ్యింది.
ఎందుకంటే.. సాధారణంగా ఓ రాజకీయ పార్టీ పేరు మారాలంటే కనీసం 30 రోజుల వ్యవధి తప్పనిసరి. అభ్యంతరాలు పరిశీలించి పార్టీ పేరు మార్పుపై తుది నిర్ణయానికి రావాలంటే ఎన్నికల సంఘానికి నెల రోజుల సమయం కావాల్సిందే. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29 ఏ అదే చెబుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ఇపప్పటికిప్పుడు పేరు మార్పునకు దరఖాస్తుకు ఎన్నికల సంఘం ఆమోదిస్తే.. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి టీఆర్ఎస్‌కు కొత్త పేరు ఖాయమవుతుంది. కావున.. మొత్తంగా టీఆర్ఎస్ త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికకు మాత్రం జాతీయ పార్టీ పేరుతో ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు.
ఇదిలాఉంటే.. ఎల్లుండి యథావిధిగా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించబోతుంది టీఆర్‌ఎస్. ఆ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం కాబోతుంది. ఉపఎన్నిక షెడ్యూల్‌తో సమావేశానికి సంబంధంలేదని అంటున్నారు సీఎం కేసీఆర్. మరి గులాబీ దళపతి మదిలో ఏముందో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..