AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: దుబ్బాక, హుజూరాబాద్‌కు ఎన్ని నిధులు తెచ్చారు?.. రాజగోపాల్ వెయ్యికోట్ల ప్రకటనపై మంత్రి తలసాని ఫైర్..

పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. మునుగోడులో పార్టీల మధ్య పోరు తీవ్రరూపం దాలుస్తోంది. నువ్వా, నేనా అన్నట్టుగా తలపడుతున్న టీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం..

Munugode Bypoll: దుబ్బాక, హుజూరాబాద్‌కు ఎన్ని నిధులు తెచ్చారు?.. రాజగోపాల్ వెయ్యికోట్ల ప్రకటనపై మంత్రి తలసాని ఫైర్..
Minister Talasani Srinivas
Shiva Prajapati
|

Updated on: Oct 16, 2022 | 12:55 PM

Share

పోలింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. మునుగోడులో పార్టీల మధ్య పోరు తీవ్రరూపం దాలుస్తోంది. నువ్వా, నేనా అన్నట్టుగా తలపడుతున్న టీఆర్ఎస్‌, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. మునుగోడులో మాటల తూటాలు పేలుతున్నాయి. నేతల మాటలతో ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. తాజాగా మునుగోడును వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తానన్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై ఫైర్ అయ్యారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

ఆదివారం నాడు మునుగోడు నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మునుగోడును వెయ్యి కోట్లతో అభివృద్ధి చేస్తామన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ డబ్బును ఎక్కడ్నించి తెస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దుబ్బాక, హుజురాబాద్‌లలో గెలిచిన బీజేపీ ఆ నియోజకవర్గాలకు ఒక్క రూపాయి అయినా సాయం చేసిందా అని మంత్రి ప్రశ్నించారు. మునుగోడు ప్రజలంతా సీఎం కేసీఆర్‌తోనే ఉన్నారని, టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని, బీజేపీ నేతల మాటలను జనం విశ్వసించడం లేదన్నారు తలసాని. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిచిన బీజేపీ నేతలు.. ఆ నియోజకవర్గాలకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకువచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలే పరమావధిగా బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని, మునుగోడు ప్రజలు ఆ పార్టీకి సరైన బుద్ధి చెబుతారని అన్నారు.

మంత్రి హరీష్ విమర్శలు..

ఇక అంతకు ముందు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు సైతం బీజేపీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే హేళన చేసిన బీజేపీకి మునుగోడుపై ప్రేమ ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. పంటలకు మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై ఏడాది దాటినా దాని ఊసే లేదని విమర్శించారు. కృష్ణా జలాల్లో వాటాను నిర్ణయించడానికి ఇంకెన్నేళ్లు పడుతుందని ప్రశ్నించారు. మునుగోడులో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని హరీశ్‌ రావు అన్నారు. నల్లగొండ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ప్రేమ ఉందని తెలిపారు. మునుగోడు నుంచి ఫ్లోరైడ్‌ రక్కసిని కేసీఆర్‌ తరిమికొట్టారని అన్నారు. ఉచిత విద్యుత్‌ ద్వారా అత్యధికంగా లబ్దిపొందుతున్న జిల్లా నల్గొండ అని హరీశ్‌ రావు వివరించారు. ఎనిమిదేళ్ల బీజేపీ పాలనలో విద్వేషాన్ని పెంచడం తప్ప చేసిందేమి లేదని హరీశ్‌ రావు విమర్శించారు. మునుగోడులో TRS అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం అక్కడ అభివృద్ధిని మలుపు తిప్పుతుందని అన్నారు. ఈ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో మునుగోడు ప్రజలు ఆలోచించాలని హరీశ్‌ రావు పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..