
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రస్థానం టీఆర్‌ఎస్‌తోనే ప్రారంభమైంది. ప్రభుత్వోద్యోగిగా ఉన్న కూసుకుంట్ల.. 20 ఏళ్ల కిందట కేసీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు.. తొలిసారి ఓడిపోయినా.. రెండోసారి మునుగోడు నుంచి బరిలో దిగి గెలుపొందారు. అప్పట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే టాప్ మెజారిటీతో గెలిచారు. ఆ తర్వాత 2018లో ఓడిపోయినా.. మళ్లీ తాజాగా జరిగిన ఉప ఎన్నికలో సత్తా చాటుకున్నారు. దాదాపు 11వేలకు పైగా మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి.. సొంతూరు ఉమ్మడి నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లింగవారిగూడెం.
బీఈడీ చదువుకున్న ప్రభాకర్‌రెడ్డి మొదట్లో ప్రభుత్వోద్యోగి.. అంతకు ముందు విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్న కూసుకుంట్ల..ఆ తర్వాత రాజకీయాల వైపు అడుగులు వేశారు..
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన తన గురువు కళ్ళెం యాదగిరి రెడ్డితో కలిసి నడిచారు.. అదే సమయంలో కేసీఆర్ పిలుపుతో.. సర్కారీ కొలువుకు రాజీనామా చేసి.. 2002లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచీ గులాబీ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధన కోసం కేసీఆర్‌తో కలిసి పోరాడారు.. మునుగోడు ప్రాంతంలో రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డి, లోకల్‌గా పాపులర్ అయ్యారు..
2009లో తొలిసారి మహేశ్వరం నుంచి..టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 8 వ స్థానంలో నిలిచారు. ఓడినా కూడా స్థానిక నేతలు, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో.. మళ్లీ టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే.. అత్యధికంగా 38,055 ఓట్ల మెజారిటీతో మునుగోడు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో.. లబ్ది చేకూర్చడంలో చురుకుగా పనిచేశారు. ఈలోగా కేసీఆర్ ముందస్తుకు వెళ్లడంతో.. 2018లో మళ్లీ ఎన్నికలొచ్చాయి. అప్పుడు కూడా.. టిఆర్ఎస్ పార్టీ నుంచీ పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి కోమట్టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేతిలో 22,552 ఓట్ల తేడాతో ఓడిపోయారు..
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత ఆగస్టు 2న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మళ్లీ కేసీఆర్.. కూసుకుంట్లనే బరిలోకి దింపారు. అటు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య హోరాహోరీ అన్నట్లు ఉప ఎన్నిక జరిగింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..