
పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులకు నిర్మల్ మున్సిపాలిటీ అధికారులు షాక్ ఇస్తున్నారు. మున్సిపల్ బకాయిలు చెల్లించని స్థానికులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే రెడ్ నోటీసులను జారీ చేసినా.. మొండి బకాయిదారులు స్పందించకపోవడంతో తమదైన స్టైల్లో షాక్ ఇస్తున్నారు మున్సిపల్ అధికారులు. ఇంటికున్న తలుపులు , గేట్లు , విలువైన పర్నిచర్ స్వాధీనం చేసుకుని ఝలక్ ఇస్తున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టర్
ఆశిష్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పన్ను ఎగవేత దారులకు తమదైన పద్దతిలో చుక్కలు చూపిస్తున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శినినగర్ కాలనీ, గాజుల్‌పేట కాలనీల్లో సోమవారం పన్నుల వసూలుకు వెళ్లిన మున్సిపల్ సిబ్బంది.. మొండి బకాయి దారుల ఇంటి నుండి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. రెండు కాలనీల్లోని ఆరు ఇండ్ల యజమానులు గత కొన్ని నెలలుగా పన్నులు చెల్లించకపోవడంతో రెడ్ నోటీసులుజారీ చేశారు. రెవెన్యూ అధికారి అనూప్ కుమార్ ఆధ్వర్యంలో ఆరు ఇండ్లను జప్తు చేసి అందులోని సామాగ్రిని మున్సిపల్ కార్యలయానికి తరలించారు.
నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్ ఆదేశాల మేరకు పన్నుల వసూళ్లకై ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన మున్సిపల్ సిబ్బంది.. పట్టణంలోని రెండు కాలనీలలో కొరడా ఝళిపించారు. ప్రభుత్వ నిధులపై ఆధారపడకుండా మున్సిపాలిటీ ఆదాయంతోనే అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించడంతో.. ఇలా మొండి బకాయిలు వసూలు చేసే పనిలో పడ్డారు. 8 బృందాలుగా ఏర్పడిన సిబ్బంది.. ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు వార్డుల వారీగా తిరుగుతూ మున్సిపల్ ట్యాక్స్ చెల్లించని వారిని కలిసి టాక్స్ కట్టాలని కోరుతున్నారు. అయినా వినని స్థానికుల సామాగ్రిని జప్తు చేసి షాక్ ఇస్తున్నారు. బకాయిలు చెల్లించడంలో జాప్యం చేయడంతో పాటు గొడవకు దిగుతున్న బకాయిదారులపై కేసులు కూడా పెడుతామంటూ చెప్తున్నారు. బకాయి వసూళ్లకు పోలీస్ సాయం కూడా తీసుకుంటున్నారు. జప్తు చేసిన సామాగ్రిని పన్ను చెల్లించి తీసుకెళ్లాలని లేదంటే వేలంవేస్తామని చెపుతున్నారు మున్సిపల్ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..