జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా భార్య ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సోమవారం ప్రసవించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరుపుకుని అందరికీ ఆదర్శంగా నిలిచిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ దంపతులను రాష్ట్ర మహిళా గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ అభినందించారు. మంగళవారం భూపాల్ పల్లిలోని మాతా శశి సంరక్ష కేంద్రాన్ని మంత్రి సందర్శించి జిల్లా కలెక్టర్ దంపతులకు జన్మించిన నూతన శిశువును, ములుగు అదనపు కలెక్టర్‌లను పలకరించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించడం ద్వారా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రజలలో విశ్వాసం నెలకొల్పేందుకు కలెక్టర్ దంపతులు ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపిక చేసుకోవడం ప్రశంసనీయమని మంత్రి కొనియాడారు. సోమవారం (అక్టోబర్ 3) సాయంత్రం ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలాత్రిపాఠికి పురిటి నొప్పులు రావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశామని, ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సంజీవయ్య ఆధ్వర్యంలో సాధారణ డెలివరీ కోసం ప్రయత్నించినప్పటికీ శిశువు బరువు ఎక్కువగా ఉండటంతో సాధారణ డెలివరీ చేయడం సాధ్యం కాలేకాలేదు. దీంతో ఆసుపత్రికి గైనకాలజిస్ట్ డాక్టర్లు శ్రీదేవి, లావణ్య, సంధ్యారాణి, విద్య ఆపరేషన్ చేసి డెలివరీ చేశారని, మగ శిశువు 3.4 కిలోల బరువుతో పూర్తి ఆరోగ్యంగా జన్మించినట్లు కలెక్టర్ మంత్రికి వివరించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించి జిల్లా ప్రజలకు కలెక్టర్ దంపతులు ఆదర్శంగా నిలిచారని, జిల్లా కలెక్టర్ భవ్యష్ మిశ్రా బాధితుల స్వీకరించిన నాటి నుంచి ఆసుపత్రి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్నారని, ఆసుపత్రిలో సౌకర్యాలు డాక్టర్ల పెంపు గురించి వైద్య అధికారులతో చర్చిస్తూ రాష్ట్రస్థాయి అధికారులకు తెలియపరుస్తూ ఆస్పత్రిలో అన్ని రకాల వైద్య సేవలను ప్రారంభించారని మంత్రి అన్నారు. అనంతరం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కలెక్టర్ దంపతులకు కేసీఆర్ కిట్‌ను అందజేశారు.
ట్విట్టర్ వేదికగా అభినందించిన వైద్యరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు
ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాటి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా దంపతులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ట్విట్టర్ వేదిక ద్వారా అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో కల్పిస్తున్న సౌకర్యాలకు ఇది నిదర్శనమని , ప్రజలలో నమ్మకం పెంచే దిశగా ప్రసవానికి ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపిక చేసుకున్నందుకు కలెక్టర్ దంపతులు ఆదర్శప్రాయమని మంత్రి కొనియాడారు.