Nalgonda: అవిశ్వాసం మాటున అసమ్మతి స్వరం.. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్‌లో ఆందోళన..

పదవులను కాపాడుకునేందుకు నేతలు.. ప్రభుత్వాలను కాపాడుకునేందుకు పార్టీలు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటాయి. ఇందు కోసం నేతలు నానా తంటాలు పడుతుంటారు. ప్రత్యర్థులను గద్దె దించేందుకు నిరంతరం కన్నేసి.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని నేతలు, పార్టీలు సద్వినియోగం చేసుకుంటాయి.

Nalgonda: అవిశ్వాసం మాటున అసమ్మతి స్వరం.. ఉమ్మడి నల్లగొండ జిల్లా బీఆర్ఎస్‌లో ఆందోళన..
No Confidence

Edited By:

Updated on: Jul 11, 2023 | 3:36 PM

పదవులను కాపాడుకునేందుకు నేతలు.. ప్రభుత్వాలను కాపాడుకునేందుకు పార్టీలు.. ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటాయి. ఇందు కోసం నేతలు నానా తంటాలు పడుతుంటారు. ప్రత్యర్థులను గద్దె దించేందుకు నిరంతరం కన్నేసి.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని నేతలు, పార్టీలు సద్వినియోగం చేసుకుంటాయి. ప్రత్యర్థులు, రాజకీయ పార్టీలకు అవిశ్వాస తీర్మానం ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఆ అవిశ్వాస ఆయుధమే.. ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గండంగా మారింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిన్నటి వరకు మున్సిపల్ చైర్మన్లు ఎదుర్కొన్న అవిశ్వాస గండం.. ఇప్పుడు ఎంపీపీలకు పట్టుకుంది. పలు చోట్ల ఎంపీపీలపై అవిశ్వాసం పెట్టడానికి ఎంపిటీసీలు సిద్ధమయ్యారు. అవిశ్వాస గడువు ముగిసిన వెంటనే ఎంపీపీలను గద్దె దించేందుకు నేతలు పావులు కదుపుతుందడంతో రాజకీయం వేడెక్కుతోంది. ఆయా మండలాల్లో ఎంపీటీసీలు జిల్లా అధికారులను కలిసి అవిశ్వాసం పెట్టాలని కోరుతున్నారు. మరికొన్ని చోట్ల అసంతృప్తులు అవిశ్వాసం దిశగా పావులు కదుపుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీపీలకు ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడంతో కూడా అవిశ్వాసాలకు కారణమవుతోంది. కిందిస్థాయి నేతలను దారికి తెచ్చుకునేందుకు కొందరు ఎమ్మెల్యేలు అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న ఎంపీపీలపై అవిశ్వాసం కోసం ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు అదును కోసం ఇంతకాలం ఎదురు చూశారు. ఈ నెల 3వ తేదీతో ఎంపీపీలు నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. ఎంపీటీసీలు ఎంపీపీలపై ఆర్డీవోలకు అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. 2018 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో వివిధ పార్టీలకు చెందిన ఎంపీపీలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ పదవులపై అప్పటికే కన్నేసి ప్రత్యర్థులుగా ఉన్న కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

తాజాగా మర్రిగూడ, సంస్థాన్‌ నారాయణపురం, హుజూర్ నగర్, చండూరు, మునుగోడు మండలాల్లో సొంత పార్టీ ఎంపీపీలపైనే ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానం సిద్ధం చేశారు. మండల అధ్యక్షుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని, తమకు అభివృద్ధి నిధులు కేటాయించ లేదని మర్రిగూడ ఎంపీపీ మెండు మోహన్‌ రెడ్డిపై ఎంపీటీసీలు అవిశ్వాసానికి దిగారు. అవిశ్వాస తీర్మానాన్ని దేవరకొండ ఆర్డీవోకు ఎంపీటీసీలు అందజేశారు. అందరి ఏకాభిప్రాయంతో తీసుకున్న అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలని ఎంపీటీసీలు కోరారు. సంస్థాన్‌ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవిపై ఎంపీటీసీలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారు. ఉమాదేవి భర్త ప్రేమ్‌చంద్రారెడ్డితో మునుగోడు ఉప ఎన్నికల నుంచే ఎమ్మేల్యేకు పొసగడం లేదట. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రేమ్‌చంద్రారెడ్డి.. అమిత్ రెడ్డితో అంటకాగుతున్నాడని స్థానిక ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నాడట. దీంతో ఎంపీపీ ఉమాదేవిపై అవిశ్వాస తీర్మానం వెనక ఎమ్మెల్యే హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది.

చండూరు ఎంపీపీ పల్లె కళ్యాణిపై అవిశ్వాసం కోరుతూ తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు ఆర్‌డీఓకు నోటీస్‌ అందజేశారు. గడిచిన నాలుగేళ్ల కాలంలో మండలంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోగా, సభ్యులకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆ నోటీస్‌లో పేర్కొన్నారు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీపీ గూడెపు శ్రీను బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తొలుత ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉన్నప్పటికీ హుజూర్ నగర్ లోని తన ఇంటిని కక్షపూరితంగానే ఎమ్మెల్యే కూల్చివేయించాడని ఎంపీపీ గూడెపు శ్రీను అప్పట్లో ఆరోపించారు. దీంతో ఎమ్మెల్యే.. ఎంపీపీ మధ్య విభేదాలు తీవ్ర మయ్యాయట. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలతో గూడెపు శ్రీను..జట్టు కట్టారట. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే ఎంపీటీసీలతో అవిశ్వాసానికి సిద్ధం చేశారట.

నిన్నటి వరకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మున్సిపల్ చైర్మన్ లకు కూడా అవిశ్వాస గండం పట్టుకుంది. మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న మునిసిపల్‌ చైర్మన్లపై అధికార బీఆర్ఎస్ అసమ్మతి నేతలే అవిశ్వాసానికి రంగం సిద్దం చేశారు. ఉమ్మడి జిల్లాలో చౌటుప్పల్‌, నల్లగొండ, కోదాడ, మిర్యాల గూడ, హాలియా, నాగార్జున సాగర్‌, భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, చండూరు, మోత్కూరు మునిసిపల్‌ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానానికి కౌన్సిలర్లు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉత్పన్నం కావడంతో సీఎం కేసీఆర్ మునిసిపల్‌ చైర్మన్ల అవిశ్వాస తీర్మాన పదవీ కాలాన్ని నాలుగేళ్లకు పెంచుతూ చట్టం చేశారు. ఈ చట్టం గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది.

ఉమ్మడి జిల్లాలో అప్పుడు మున్సిపల్ చైర్మన్లు.. ఇప్పుడు ఎంపీపీలకు అవిశ్వాస గండం.. సొంత పార్టీ నేతలు నుంచే ఎదురైంది. అప్పుడు.. ఇప్పుడు అవిశ్వాస గండం ఎదుర్కొంటున్న నేతలందరూ అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. అవిశ్వాస తీర్మానం మాటున అధికార బీఆర్ఎస్ లో అసమ్మతి స్వరం వినబడుతోంది. మరోవైపు ఎంపీటీసీలు డబ్బు ఆశతో అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చి ఎంపీపీలతో బేరాలు కుదుర్చుకుంటున్నారనే విమర్శ కూడా ఉంది. ఉమ్మడి జిల్లాలో అవిశ్వాస తీర్మానాల సంఖ్య పెరుగు తుండడంతో అధికార పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని అసమ్మతి స్వరాన్ని అణచివేసేందుకు యత్నిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..