
Medicine Students: వాళ్లంతా ఎంతో కష్టపడి చదివారు. మంచి ర్యాంకులు సాధించి మెడికల్ సీట్లు సంపాదించారు. కానీ, కాలేజీ యాజమాన్యం చేసిన తప్పులతో వాళ్లంతా రోడ్డునపడ్డారు. కాలేజీ యాజమాన్యం చేసిన తప్పుకు విద్యార్ధులు శిక్ష అనుభవిస్తున్నారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 79మంది మెడికల్ స్టూడెంట్స్ రోడ్డునపడ్డారు. MNR మెడికల్ కాలేజీ మేనేజ్‌మెంట్ మిస్టేక్స్‌తో వైద్య విద్యార్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కష్టపడి చదివి మెడికల్ సీట్లు సాధించింది కొందరైతే, లక్షల రూపాయలు పోసి మేనేజ్‌మెంట్ కోటాలో చేరినవాళ్లు మరికొందరు. ఇప్పుడు వీళ్లంతా రోడ్డు మీదకు వచ్చారు. ఏం చేయాలో పాలుపోక గందరగోళంలో పడ్డారు. ఓవైపు లక్షల రూపాయల మనీ కోల్పోయి, మరోవైపు భవిష్యత్ ఏంటో అర్ధంకాక సతమతవుతున్నారు.
MNR మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్స్‌లో తనిఖీలు చేసిన MNC.. అనేక కారణాలతో ఆ కళాశాల పర్మిషన్‌ను రద్దు చేసింది. దాంతో, అక్కడ చదువుతోన్న 79మంది పీజీ మెడికల్ విద్యార్ధుల పరిస్థితి అయోమయంలో పడింది. ఒక్కసారిగా MNR మెడికల్ కాలేజీ పర్మిషన్ క్యాన్సిల్ చేయడంతో వాళ్లంతా రోడ్డునపడ్డారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను కలిశారు. ఎక్కడా సహాయం దొరకపోవడంతో చివరికి తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్‌రావుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో హరీష్ ఇంటికి వెళ్లిన మెడికల్ స్టూడెంట్స్, తమ పరిస్థితిని వివరించారు. MNR మెడికల్ కాలేజీ పర్మిషన్ రద్దు చేయడంతో తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని విన్నవించుకున్నారు. తమకు మీరే న్యాయం చేయాలంటూ మంత్రి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.
అయితే, ఇతర మెడికల్ కాలేజీల్లో రీలోకేట్ చేయాలని MNC ఆదేశాలు ఇచ్చిందని, అయినా హెల్త్ యూనివర్సిటీ పట్టించుకోవడం లేదని అంటున్నారు బాధిత విద్యార్ధులు. MNC ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం తమను ఇతర కాలేజీల్లో రీలోకేట్ చేయాలని కోరుతున్నారు బాధిత స్టూడెంట్స్. మెడికల్ స్టూడెంట్స్ నుంచి వివరాలు తీసుకున్న హరీష్‌రావు, ఉన్నతాధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు.