MLA’s Wives in Politics: పతుల బాటలోనే సతులు.. పాలిటిక్స్‌లో ఫుల్‌ యాక్టివ్‌గా ఎమ్మెల్యేల సతీమణులు

|

Mar 23, 2022 | 12:15 PM

భర్తల్ని వీరతిలకం దిద్ది ఎలక్షన్లకు పంపిన భార్యలు.. ఇప్పుడు వారి నియోజకవర్గాల్లో రాజకీయాల్ని శాసిస్తున్నారు.

MLAs Wives in Politics: పతుల బాటలోనే సతులు.. పాలిటిక్స్‌లో ఫుల్‌ యాక్టివ్‌గా ఎమ్మెల్యేల సతీమణులు
Mla Wife
Follow us on

MLA’s Wives in Politics: భర్తల్ని వీరతిలకం దిద్ది ఎలక్షన్లకు పంపిన భార్యలు.. ఇప్పుడు వారి నియోజకవర్గాల్లో(Constituency) రాజకీయాల్ని శాసిస్తున్నారు. అవును.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా(Warangal District)లో ఇప్పుడు ఇలాంటి దృశ్యాలే.. రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ప్రతీ మగవారి విజయం వెనుక ఒక మహిళ వుంటుందంటారు.. కానీ, ఈసారి చాలా నియోజకవర్గాల్లో ఆడవారి వెనకే మగవారు ఉండేలా కనిపిస్తోంది పరిస్థితి. MLAల కంటే ఎక్కువగా వారి సతీమణులే పార్టీ కార్యక్రమాల్ని చక్కదిద్దుతున్నారంటేనే భవిష్యత్తు ఏమిటనేది తెలిసిపోతోంది. చాలామంది శాసనసభ్యుల పట్టపురాణుల జోష్‌ చూస్తుంటే.. ఈ అనుమానాలన్నీ పటాపంచలవుతున్నాయి.

భార్యల్ని బరిలోకి దించడం ఎమ్మెల్యే ప్లాన్‌గానే తెలుస్తోంది. నియోజకవర్గాల్లో పట్టు చేజారకుండా వారి సతీమణులను యాక్టివ్ చేశారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా భూపాలపల్లి MLA గండ్ర వెంకటరమణారెడ్డి సతీమణి, వరంగల్‌ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి ఈ మధ్య భూపాలపల్లిపై ఎక్కువ ఫోకస్ పెంచినట్టు కనిపిస్తోంది. నియోజక వర్గంలో తన భర్త కంటే.. ఆవిడే ఎక్కువగా పర్యటిస్తూ ప్రజల్ని కలుస్తుండటం చర్చకు దారి తీసింది. గండ్ర జ్యోతి స్పీడుచూసి.. ఆమె భర్త వెంకటరమణరెడ్డే అనుచరుల ముందు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. వంటింట్లో ఉన్న తన భార్యను రాజకీయాల్లోకి దింపితే… తన సీటుకు స్పాట్ పెడుతోందంటూ బహిరంగంగా చెప్పడం అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు నియోజకవర్గ ప్రజల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

పరకాల MLA చల్లా ధర్మారెడ్డి సతీమణి చల్లా జ్యోతి కూడా.. పొలిటికల్‌గా ఫుల్ యాక్టివ్ అయ్యారు. నియోజక వర్గంలో జరిగే ప్రతీ కార్యక్రమంలోనూ ఆమె ప్రజెన్స్‌ కనిపిస్తోంది. ఆమె తీరు పార్టీ శ్రేణులు, ప్రజలలో ఆశ్చర్యకరంగా మారింది. చల్లా దర్మారెడ్డి వివిధ కారణాల వల్ల కొన్ని కార్యక్రమాలకు హాజరుకాలేక పోయినా… చల్లా జ్యోతి మాత్రం ప్రతీ గ్రామంలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తుండటం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది.

వరంగల్ తూర్పు MLA నన్నపునేని నరేందర్ సతీమణి కూడా అదే బాటలో ఉన్నారు. రాజకీయంగా నియోజకవర్గంలో చురుగ్గా ఉంటున్నారు. తన భర్తతో కలిసి ప్రతీ కార్యక్రమంలో ప్రత్యక్షమవుతున్న ఆమె.. నియోజకవర్గంలోని కార్యకర్తలు, ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ శ్రేణులు, క్యాడర్ కు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటున్నారు. మహబూబాబాద్ MLA శంకర్ నాయక్ సతీమణి డాక్టర్‌ సీతామహాలక్ష్మీ కూడా నియోజకవర్గంలో ఫుల్ బిజీ అయిపోయారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన మార్క్ ప్రదర్శిస్తున్నారు. కొన్ని కార్యక్రమాలలో తన భర్త అటెండ్ కాలేకపోయినా అక్కడ తను ప్రత్యక్షమై పబ్లిక్ రిలేషన్ మెయింటెన్‌ చేస్తున్నారు.

మొత్తానికి, ప్రజా ప్రతినిధుల సతీమణులు.. నియోజకవర్గాల్లో స్పీడు పెంచడం పట్ల.. ఉమ్మడి వరంగల్‌ రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు వచ్చే ఎన్నికలకు ముందస్తు వ్యూహమంటుంటుంటే.. మరికొందరు నియోజకవర్గంలో పట్టు జారకుండా ఎమ్మెల్యేలు సతీమణులను యాక్టివ్ చేశారనేది ఇంకొందరి మాట. ఏదేమైనా.. నేతల సతీమణుల సందడితో.. రాజకీయాలకు కొత్త కళ వచ్చిందనేవారూ లేకపోలేదు.

పెద్దీష్, టీవీ 9 ప్రతినిధి, ఉమ్మడి వరంగల్ జిల్లా.

Read Also…  Mahmood Ali: బోయిగూడలో అగ్నిప్రమాదం ఘటనాస్థలంలో హోంమంత్రి మహమూద్‌ అలీకి తృటిలో తప్పిన ప్రమాదం!