Amarnath Yatra: భారీ వర్షాలు, వరదలతో అమర్‌నాథ్ (Amarnath Yatra) యాత్ర కాస్తా విషాద యాత్రగా మారింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన 15 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. సుమారు 45 మందకి పైగా గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ఇక గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్,ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇదిలా ఉంటే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) కూడా ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లిన ఆయన త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ మేరకు యాత్రలో తనకెదురైన భయానక అనుభవాలను పంచుకున్నారు.
‘ఇటీవల నా కూతురు వివాహం జరిగింది. కుమార్తె, అల్లుడితో పాటు మొత్తం 11 మంది కుటుంబ సభ్యులతో ఈనెల 6న అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరాం. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ రద్దు కావడంతో ఢిల్లీ నుంచి అతికష్టం మీద గురువారం సాయంత్రం పంచతరణికి చేరుకున్నాం. రాత్రి అక్కడ ఓ గుడారంలో నిద్రించాం. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు గుర్రాలపై అమర్‌నాథ్‌కు చేరుకున్నాం. మధ్యాహ్నం ఒంటి గంటకు అమర్‌నాథ్‌లో దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత సుమారు అర కిలోమీటరు దూరం నడిచి వచ్చామో లేదో భయంకరమైన శబ్ధాలతో వరద ప్రవాహం కనిపించింది. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడ ఉన్నారు. హాహాకారాలు, ఉరుకులు, పరుగులు మొదలయ్యాయి. మా కళ్లముందే ఎంతో మంది కొట్టుకుపోయారు. దీంతో మాలో భయం మొదలైంది. ఆ భయానక దృశ్యాలను చూసి ప్రాణాలతో బయటపడతామా? అన్న అనుమానం కలిగింది. అయితే అదృష్టవశాత్తూ సమయానికి గుర్రాలు దొరికాయి. వెంటనే వాటిపై తిరుగుప్రయాణమయ్యాం. మూడు గంటల పాటు ప్రయాణం చేసి కిందకు చేరుకున్నాం. నాకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నందున పోలీసులు మాకు ప్రత్యేక ఎస్కార్ట్ వాహనాన్ని సమకూర్చారు. నా కుటుంబసభ్యుల్ని వెంటనే శ్రీనగర్‌కు తరలించారు. కొన్ని నిమిషాలు ఆలస్యమైతే మా పరిస్థితి మరోలా ఉండేదేమో. అదృష్టవశాత్తు మేం బయటపడ్డాం. శనివారం వైష్ణోదేవీ అమ్మవారి దర్శనానికి వెళ్తాం. ఆదివారం విశ్రాంతి తీసుకొని సోమవారం తిరిగి హైదరాబాద్‌కు వస్తాం. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది భక్తులు అక్కడ మాకు ఎదురయ్యారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చడానికి భద్రతా సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు ‘ అంటూ చెప్పుకొచ్చారు రాజాసింగ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..