బులియన్ మార్కెట్ లో బంగారం ధర దోబూచులాడినట్టే… వ్యవసాయ మార్కెట్ లో ఎర్రబంగారం ధర తలకిందులవుతుంది..పూటకో రేటు పలుకుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.. నిరుడు ఇదే సమయానికి ఇరవై వేల పైచిలుకు పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు 14 వేలకు పడిపోయింది. అధికారులు ఇరవై వేలు పలుకుతోందని బీరాలు పలుకుతున్నా.. అది క్షేత్రస్థాయిలో కన్పించడంలేదు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో దళారులదే రాజ్యం నడుస్తుండటంతో రైతులు వారు చెప్పిన రేటుకే పంటను కట్టబెట్టి నిరాశ చెందుతున్నారు. ఆశించిన ధరలు లేక నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు ఎర్రబంగారం రైతులు.
వరంగల్ లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్..ఆసియాలోనే అతి పెద్దదని తెలిసిందే. ఇక్కడకు తెలంగాణ నుంచే కాదు పొరుగు రాష్ట్రాల నుండి కూడా రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ము కోవడానికి ఇక్కడికి తీసుకు వస్తుంటారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం విస్తారంగా పెరగడంతో మిర్చిపంటతో మార్కెట్ పోటెత్తింది. సుదూర ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడకు మిర్చిపంటను తీసుకొచ్చారు. ఇక్కడైతే ధర ఎక్కువగా ఉంటుందన్న ఆశతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి రైతులు ఇంతదూరం పంటను తీసుకొస్తే… ఇక్కడ ధరల్లో నెలకొన్న గందరగోళంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
మార్కెట్ లో అధికారులు ఆయా మిర్చిపంట రకాన్ని బట్టి 18వేల నుంచి 20వేల రూపాయల వరకు ధర పలుకుతోందని చెబుతున్నా… ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. వ్యాపారులు చెప్పిందే రేటు.. వారు చెప్పిన ధరకే విక్రయించాలి. లేదంటే రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. మార్కెట్ అధికారులు, మార్కెట్ కమిటీ పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు, దళారులు రెచ్చిపోయి…ఇష్టం వచ్చిన ధరలకు కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు.. ఇరవై వేల రూపాయలు పలకాల్సిన ధరను 13 నుంచి 14 వేల రూపాయలకే పరిమితం చేస్తున్నారు.. సరైన గిట్టుబాటు ధరలు రాక రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిత్యవసర వస్తువుల ధరలు పెరిగాయి.. పెట్రోల్-డీజిల్ ధరలు సెంచరీ కొట్టాయి.. కానీ ఈ అన్నదాతల కష్టానికి మాత్రం ధరలు పెరగడం లేదు.. ఆరేళ్ళ క్రితం పలికిన ధరకంటే తక్కువ ధరకే రెక్కల కష్టాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరం మిర్చిపంట సాగుకు యాభైవేల నుంచి లక్ష రూపాయల వరక ఖర్చుఅవుతోంది… కానీ పంటకు తగిన గిట్టుబాటు ధరలు రావడం లేదని రైతులు వాపోతున్నారు.
కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో ఇబ్బందులను ఛేదించి, నెత్తురును చెమటగా మార్చుకుని మిర్చి సాగు చేసిన రైతుకు గిట్టుబాటు ధరలు రాకపోవడంతో ఇక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దొరకక రైతుగా మారిన యువ రైతులు కూడా ఈ మార్కెట్ యార్డులో మిర్చి అమ్మకానికి తీసుకు వచ్చి ధరలు లేక నోరెళ్ల బెడుతున్నారు. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం మిర్చికి మద్దతు ధర అనేది లేదు కాబట్టి… డిమాండ్ ను బట్టి హెచ్చు తగ్గులు అవుతుందంటున్నారు. రైతులకు సరైన మద్దతు ధర రాకపోతే కోల్డ్ స్టోరేజ్ లలో భద్రపర్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు.
కరోనా కష్టాలు వెంటాడినా… ప్రకృతి సహకరించకపోయినా.. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు విస్తారంగా మిర్చి సాగుచేశారు. పైగా వరంగల్ మిర్చికి జాతీయ- అంతర్జాతీయ మార్కెట్ లో ఫుల్ క్రేజ్ ఉండడంతో రైతులు ఎక్కువగా ఎర్రబంగారం సాగు చేశారు. కానీ ఆ పంటను అమ్ముకునే సమయానికి దళారులు ఎగురేసుకుపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ దోపిడీని అరికట్టి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన అసవరం ఉంది.
Also Read:
Telangana News: ఒకే తాటిచెట్టుపై 17మంది ఎక్కారు… అరెరే ఏంటీ చిత్రం.. తెలుసుకుందాం పదండి
Crime News Telangana: నీటి పారుదల శాఖ ఆఫీస్‌లో పని చేస్తున్న అధికారి.. అతగాడి చేతివాటం మీరే చూడండి