Telangana: చేరికలతో చేతికి కొత్త చిక్కులు.. తూర్పు కాంగ్రెస్‌లో బయటపడ్డ లుకలుకలు!

| Edited By: Balaraju Goud

Aug 24, 2024 | 1:39 PM

ఒకరేమో మంత్రి భర్త, మాజీ ఎమ్మెల్సీ.. మరొకరు ఈమధ్యే అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్సీ.. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వార్ ముదిరింది. మంత్రి భర్త నేరుగా ఆ ఎమ్మెల్సీని హెచ్చరించడం ఇటు రాజకీయ వర్గాలు - అటు ఓరుగల్లు ప్రజలలో హాట్ హాట్ చర్చగా మారింది.

Telangana: చేరికలతో చేతికి కొత్త చిక్కులు.. తూర్పు కాంగ్రెస్‌లో బయటపడ్డ లుకలుకలు!
Baswaraju Saraiah Konda Murali
Follow us on

ఒకరేమో మంత్రి భర్త, మాజీ ఎమ్మెల్సీ.. మరొకరు ఈమధ్యే అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్సీ.. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వార్ ముదిరింది. మంత్రి భర్త నేరుగా ఆ ఎమ్మెల్సీని హెచ్చరించడం ఇటు రాజకీయ వర్గాలు – అటు ఓరుగల్లు ప్రజలలో హాట్ హాట్ చర్చగా మారింది. అసలేం జరిగింది..? ఆ మంత్రి భర్త ఎందుకలా ఫైర్ అయ్యాడు..? స్వంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఎందుకంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు..? మరి ఆ MLC ఏం చేయబోతున్నారు..? అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది.

ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్‌కు పెట్టని కోట వరంగల్‌ జిల్లా. అలాంటి జిల్లాలో, అటు అసెంబ్లీ.. ఇటు పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించింది కాంగ్రెస్‌. గులాబీ దళానికి షాకిస్తూ.. మెజార్టీ అసెంబ్లీ స్థానాలు, రెండింటికి రెండు పార్లమెంటు స్థానాలనూ గెలిచింది. ఆ హుషారు చూసి ప్రతిపక్ష పార్టీ నుంచి నేతలు.. కాంగ్రెస్‌లోకి వరుసకట్టారు. ఇప్పుడు ఆ చేరికలే.. వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా రగులుతున్న లోకల్‌ హస్తం పార్టీ.. ఇప్పుడు రోడ్డెక్కింది. మంత్రి కొండా సురేఖ భర్త , మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇటీవల పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యకు స్ట్రెయిట్‌ వార్నింగ్ ఇవ్వడం హాట్ హాట్ చర్చకు దారితీసింది.

డబ్బా దుకాణాల కూల్చివేతతో మొదలైన రచ్చ!

అమాత్యురాలి భర్త చేసిన ఈ హాట్ కామెంట్స్‌ వెనక కారణం లేకపోలేదు. పోచమ్మ మైదాన్‌ దగ్గర.. రోడ్లకు ఇరువైపుల ఉన్న చిరు దుకాణాలను… ఇటీవల మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూల్చేశారు. ఆ డబ్బా దుకాణాల యజమానులను… కొండా మురళి పరామర్శించారు. వారికి అండగా ఉంటానని చెప్పడమే కాదు… కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు. ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు రాకుండా.. ఇంతవరకూ ఆయన చేసింది బానే ఉంది. కానీ, ఆ వేదికగా ఆయన చేసిన కామెంట్సే ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి. ఈ కూల్చివేతల వెనుక పూర్తి హస్తం బస్వరాజు సారయ్యదేనంటూ.. పరోక్షంగా ఆయన చేసిన కామెంట్స్‌ కాకపుట్టిస్తున్నాయి.

తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల రాజ్యం!

తూర్పు నియోజకవర్గంలో ఇప్పుడు కొండా దంపతుల టైం నడుస్తోంది. వాళ్లేం చెబితే అదే రైట్‌. అయితే, తాజాగా బాధితులను పరామర్శించడం కొండా మురళి ఓకే.. కానీ సారయ్యపై కోపాన్ని ప్రదర్శించడం ఎందుకన్నదే చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పనులు మానుకోకపోతే సీన్ వేరేలా ఉంటుందంటూ.. గట్టిగానే హెచ్చరించారు మురళి. గతంలో తాను, ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యాక.. పార్టీ మారిన వెంటనే రాజీనామా చేశానని, దమ్ముంటే సారయ్య కూడా రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్‌ చేశారు. ఇక్కడ జరుగుతున్న వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. దీంతో, ఈ వార్నింగులు.. సవాళ్లు… ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన కాంగ్రెస్‌ క్యాడర్‌లో కనిపిస్తోంది.

కొండాకు తెలియకుండా చేరికలు..?

తూర్పు వరంగల్‌లో ఈ ఆధిపత్య పోరుకు ప్రధానకారణం… కొండా దంపతుల ప్రమేయం లేకుండా బస్వరాజు సారయ్య అధికార పార్టీలోకి రావడమేనట. ఇక్కడి నుంచే గెలిచిన కొండా సురేఖ.. ఇప్పుడు రాష్ట్ర మంత్రి. నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పట్టు సాధించినట్టే కనిపించింది. కానీ, ఆ తర్వాత.. కొండా దంపతులకు సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరిగిపోయాయి. నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యల చేరిక అలాగే జరిగింది. వారు, నేరుగా పార్టీ అధిష్టానంతో టచ్‌లో ఉంటున్నారు. ఈ అంశమే కొండా దంపతులకు మింగుడు పడట్లేదని తెలుస్తోంది. అందుకే ఈ వార్నింగులు, సవాళ్లు అంటున్నారు పొలిటికల్‌ ఎనలిస్టులు.

ఆధిపత్యపోరుతో కాంగ్రెస్‌లో కల్లోలం!

ఇప్పటికే పలు దఫాలు.. తూర్పు పంచాయితీని, కాంగ్రెస్ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు లోకల్‌ లీడర్లు. అయితే వారు కూడా… ఎవరికివారు మాకెందుకులే అన్నట్లుగా సైలెంట్‌గా ఉంటున్నారట. దీంతో, తాజాగా రాజుకుంటున్న ఆధిపత్యపోరు.. ఓరుగల్లు కాంగ్రెస్‌లో కల్లోలం సృష్టిస్తోంది. కొండా మురళి చేసిన కామెంట్స్‌పై.. సీఎం రేవంత్‌కు ఫిర్యాదు చేసేందుకు బస్వరాజు సారయ్య సిద్ధమవుతున్నారు. పార్టీ అంతర్గత విషయాలు… పార్టీలోనే చూసుకుంటామనీ… చెబుతున్నారట.

ఆధిపత్యపోరులో నలిగిపోతున్న క్యాడర్‌!

చేరికలతో వరంగల్‌ కాంగ్రెస్‌లో వార్‌ పీక్స్‌ చేరుకుందనే విషయం.. తాజా ఎపిసోడ్‌తో స్పష్టమవుతోంది. సుబ్బి పెళ్లి ఎంకి సావుకొచ్చిందన్నట్టు.. నేతల మధ్య ఈ ఆధిపత్యపోరు… క్యాడర్‌ మీద ప్రభావం చూపుతోంది. ఒకవైపు మంత్రి భర్త.. మరోవైపు ఎమ్మెల్సీ.. దీంతో కరవమంటే కప్పకు కోపం.. వదలమంటే పాముకు కోపం అన్నట్టుగా తయారైంది పరిస్థితి. నేతల మధ్య ద్వితీయ శ్రేణి నాయకులు, అధికారులు నలిగిపోతున్నారు. మరి, తూర్పు వరంగల్‌ కాంగ్రెస్‌లో ఈ ఇంటర్నల్‌ వార్‌కు ఎప్పుడు పుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి..!

వీడియో చూడండి.. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..