
తెలంగాణలో చెక్‌పోస్టుల శకం ముగిసింది. సీఎం రేవంత్ ఆదేశాలమేరకు రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులను ఎత్తివేసినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ క్లారిటీ ఇచ్చారు. టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్‌తో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు.
ప్రజా సౌకర్యాల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా చెక్ పోస్టులను ఎత్తివేశామని మంత్రి పొన్నం తెలిపారు. చెక్ పోస్టులపై నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రతిపాదించింది తానే అని మంత్రి తెలిపారు. డీటీవోల ఆధ్వర్యంలో చెక్‌పోస్టుల దగ్గర బోర్డులు, బ్యారికేడ్లను తొలగించామన్నారు. రోడ్డు భద్రత, ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడంలో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చెక్‌పోస్టులు ఎత్తివేసినా, అక్రమ రవాణాను అడ్డుకోవడానికి మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి పొన్నం తెలిపారు.
రవాణా శాఖలో AI టెక్నాలజీని వినియోగిస్తూ పారదర్శక వ్యవస్థను తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. వాహనాలకు సంబంధించిన రికార్డులు, టాక్స్, ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్ వంటి అంశాలను ఆన్‌లైన్ ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. ఇందు కోసం త్వరలోనే సారథి సిస్టమ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..