రాకరాక తెలంగాణలో అధికారమొస్తే… ఇప్పుడు సొంత పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయ్యారయ్యారు. ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొండా సురేఖ… వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. అసలు ఆమె కావాలని చిక్కులు కొనితెచ్చుకుంటున్నారా? లేక టైమ్ బాగోలేక.. ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయా? అనేది అర్థంకాని పరిస్థితి. అయితే, ఆమె ప్రవర్తన మాత్రం… ఇటు పార్టీకి, అటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, పార్టీలో ఆమె వ్యవహారశైలి గ్రూప్ రాజకీయాలకు తావిస్తోందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఒక మంత్రిగా ఉండి ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఏంటనేదే.. ఎవరికీ అర్థంకావడం లేదు. దీంతో ఈ అమాత్యురాలిపై హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇటీవల ప్రతిపక్షాలపై విమర్శలు చేయబోయి.. హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై ఆమె చేసిన కామెంట్స్… ఇటు రాజకీయాల్లోనూ, అటు సినిమారంగంలోనూ పెద్ద దుమారమే రేపాయి.తనపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ… ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చేక్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ విషయంపై సినీ పరిశ్రమ తీవ్రంగా స్పందించింది. అయితే, కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని భేషరతుగా వెనక్కి తీసుకున్నా… ఈ వివాదం సద్దుమణగలేదు. దీనిపై హీరో నాగార్జున, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ అంశంపై నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేసిన న్యాయస్థానం… మంత్రి కొండా సురేఖకు నోటీసులు కూడా జారీ చేసింది. దీంతో, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ఈ మహిళా మంత్రి విషయంలో మింగలేక కక్కలేక అన్నట్టుగా తయారైంది.
ఇప్పటికే ఆమెపై కోర్టు దావాలు కొనసాగుతున్న వేళ… సొంత జిల్లాలో, సొంత పార్టీలో ఆమె వ్యవహార శైలి మరో దుమారానికి తెరలేపింది. దసరా పండగరోజు స్థానికంగా ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో… కొండా సురేఖ ఫోటో లేదంటూ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి ఫ్లెక్సీలను ఆమె అనుచరులు చింపేశారు. దీంతో, రేవూరి ప్రకాష్ రెడ్డి. కొండా సురేఖల మధ్య గొడవ మరోసారి పీక్స్‌కు చేరింది. గీసుకొండ పోలీస్ స్టేషన్‌లో సురేఖ అనుచరులపై.. రేవూరి ఫాలోవర్స్.. కేసు కూడా పెట్టారు. ఇక్కడిదాకా వ్యవహారం చూస్తే.. ఇదంతా కాంగ్రెస్‌లో షరా మామూలే అనుకోవచ్చు. కానీ, ఆ తర్వాత కొండా సురేఖ వ్యవహరించిన తీరే.. పెద్ద రచ్చకు దారితీసింది. తన అనుచరులపై కేసు నమోదు చేసిన పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కొండాసురేఖ.. ‘ నా అనుచరులమీదే కేసు పెడతారా? అంటూ కోపంతో ఊగిపోయారు. ఏకంగా సీఐ సీట్లో కూర్చొన్నారు మంత్రిగారు. అక్కడున్న పోలీసులను దడదడలాడించేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ప్రకాష్‌జూ… హుటాహుటిన అక్కడికెళ్లి.. అమ్మా అమ్మా క్షమించడంటూ… ఆమెను సముదాయించి పంపించేశారు. దీంతో, ఒక రాష్ట్రమంత్రిగా ఉంటూ.. పోలీస్ స్టేషన్‌లో ఆమె ప్రవర్తన సరికాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రత్యర్థులతోనే కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ కొండాసురేఖ ఢీ అంటే ఢీ అంటున్నారు. రేవూరితో ఆమె జగడం కారణంగా.. వరంగల్‌లో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇదేదో పెద్ద డ్యామేజ్ అయ్యేలా ఉందని గుర్తించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం… వెంటనే అలెర్టయ్యింది. ఫ్లెక్సీ వివాదంపై ఆమెతో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఫోన్‌లో మాట్లాడారట. ఇదే అంశంపై టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన… కార్యకర్తలు ,నాయకుల అత్యుత్సాహం వల్లే ఈ వివాదం ఏర్పడిందని చెప్పారు. ఇద్దరు నాయకులతో మాట్లాడటంతో గొడవ సద్దుమణిగిందన్నారు. ఇక, గీసుకొండ పీఎస్‌లో సీఐ కుర్చీలో సురేఖ కూర్చున్న విషయం తన దృష్టికి రాలేదన్న పీసీసీ చీఫ్… అక్కడి అధికారులు మార్యాదపూర్వకంగానే ఆమెను సీఐ కుర్చీలో కూర్చోబెట్టి ఉండొచ్చన్నారు.
తనతో సై అంటే సై అంటున్న కొండా సురేఖ సంగతిని అధిష్ఠానమే చూసుకుంటుందన్నారు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి. స్థానికంగా జరిగిన సంఘటనను హైకమాండ్ పూర్తిగా స్కాన్ చేస్తుందన్న రేవూరి… కాంగ్రెస్ లాంటి పెద్ద కుటుంబంలో చిన్నచిన్న గొడవలు కామన్ అన్నారు. సురేఖతో వ్యక్తిగత విభేదాలు లేవన్న ప్రకాష్‌రెడ్డి… అన్నీ అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు.
ఇప్పటికే అటు కేటీఆర్‌పై.. ఇటు నాగార్జున ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ.. తాజాగా సొంత జిల్లాలో సొంత పార్టీ ఎమ్మెల్యేతో కయ్యానికి కాలు దువ్వడం మరింత వివాదాస్పదమవుతోంది. క్యాబినెట్ మంత్రిగా ఆమె వ్యవహరిస్తున్న తీరు…పార్టీకి మింగుడు పడట్లేదని సమాచారం. మరి , ఆమె విషయంలో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తి రేపుతోంది. దాన్ని బట్టే హైకమాండ్ చర్యలు ఉంటాయని తెలుస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..