
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో దీక్షను విరమించారు. కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బుధవారం నాడు.. కిషన్‌రెడ్డి ఇందిరా పార్కు వద్ద 24 గంటల దీక్షను చేపట్టారు. అయితే సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేశారు. ఆ దీక్ష ప్రాంగణాన్ని చుట్టిముట్టి కిషన్ రెడ్డిని బలవంతంగా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. అంతకుముందు ధర్నా చౌక్ వద్ద తోపులాట జరిగింది. అయితే ఈ తోపులాటలో కిషన్‌రెడ్డి చేతికి, ఛాతికి గాయాలవడంతో అక్కడికి వచ్చిన వైద్యులు పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం కూడా మరోసారి ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరీక్షించారు. ఇదిలా ఉండగా.. ధర్నాచౌక్ ప్రాంగణానికి చేరుకున్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జావడేకర్.
నిమ్మరసం ఇచ్చి కిషన్ రెడ్డి దీక్షను విరమంపజేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాన్ని అభినందిస్తున్నానని ప్రశంసించారు. అలాగే బీజేపీ కార్యకర్తలు చూపిన తెగువను కూడా అభినందిస్తున్నానని అన్నారు. ఇప్పటికే వివిధ సందర్భాల్లో బీజేపీ సత్తాను కేసీఆర్ కు చూపించామని.. కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు ఇంకా చాలానే ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. బుధవారం రోజున కిషన్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేస్తున్నారని ప్రకాష్ జావడేకర్ అన్నారు. అయితే శాంతియుతంగా ధర్నా చేసినా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సమస్య ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడ్డాడని విమర్శించారు. అందుకే పోలీసులను పంపించి దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర చేసినట్లు ఆరోపణలు చేశారు.
అలాగే తెలంగాణ యువతను మోసం చేశామనే విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసంటూ విమర్శలు చేశారు. యువత కేసీఆర్ ను తొలగించాలి..తెలంగాణను బతికించుకోవాలి అంటూ పిలుపునిచ్చారు. ఎన్నికలకు వంద రోజుల సమయం ఉందని.. ఇంకా చేయాల్సి చాలా ఉందని.. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసే ఉద్యమాన్ని కొనసాగిద్దామంటూ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా మరోవైపు ఈ ఏడాది డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు మంత్రి కేటీఆర్ ఎన్నికలు ఆలస్యం కావచ్చని చెప్పడంతో ఎన్నికలపై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా.. లేదా జమిలీ ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని రోజుల్లో జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.