
వనపర్తి జిల్లా పర్యటనకు వచ్చిన పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. కొల్లాపూర్ పట్టణంలోని సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చేరుకున్న మంత్రి, నేరుగా విద్యార్థులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల డైట్ చార్జీలు పెంచిన నేపథ్యంలో మెనూ అమలుపై విద్యార్థులను ఆరా తీశారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు.. గురుకుల పాఠశాల మొత్తం కలియతిరుగుతూ.. అన్ని అంశాలను స్వయంగా పరిశీలించారు. మంత్రి కృష్ణారావుకు ఓ విచిత్ర అనుభవం ఎదురైంది. ఓ తరగతి గదిలో అభినయ అనే విద్యార్థిని ఏడుస్తూ కూర్చుంది. విషయం గమనించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. విద్యార్థిని దగ్గరికి వెళ్ళి ఆరా తీశారు. అభినయ అనే విద్యార్థినికి పాఠశాలలో కొత్తగా 5వ తరగతిలో సీటు వచ్చింది. తొలిసారి ఇంటిని వదిలి గురుకులంలో చేరడంతో తల్లిదండ్రులపై బెంగ పెట్టుకుంది. ఈ క్రమంలో విద్యార్థిని అభినయ దగ్గరికి వెళ్ళి స్వయంగా ఓదార్చే ప్రయత్నం చేశారు మంత్రి జూపల్లి.
అభినయ ను కుర్చీలో కూర్చోబెట్టి తాను కింద కూర్చుని మాటలు కలిపారు. గురుకుల పాఠశాలలో అందుతున్న వసతుల గురించి విద్యార్థినికి విన్నవించారు. స్వయంగా తన ఫోన్ నుంచి అభినయ తల్లి వరలక్ష్మికి ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం అభినయను మాట్లాడించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రతీ శనివారం లేదా ఆదివారం స్కూల్‌ను సందర్శంచి మీ పాపతో రెండు గంటలపాటు గడిపి వెళ్లాలని మంత్రి కోరారు. ప్రస్తుతానికి పాఠశాలకు వచ్చి కూతురిని చూసి వెళ్లాలని సూచించారు.
విద్యార్థిని అభినయను ఏకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఓదార్చడం ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఓపికగా కూర్చొని విద్యార్థినికి భరోసా కల్పించడం అందరినీ ఆకట్టుకుంది. గురుకులాలపై ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉంటే మంచి ఫలితాలు వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..