Telangana Budget 2023: సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డాం.. దేశ వృద్ధి రేటు కంటే తెలంగాణాదే ఎక్కువ: మంత్రి హరీశ్ రావు

|

Feb 06, 2023 | 12:28 PM

సీఎం కేసీఆర్ సారాథ్యంలో తెలంగాణ ఆచ‌రిస్తుంది.. దేశం అనుస‌రిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం, క‌రోనావైరస్ లాంటి సంక్షోభాల‌ను త‌ట్టుకుని రాష్ట్రం అగ్రస్థానంలో నిల‌బ‌డిందన్నారు.

Telangana Budget 2023: సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డాం.. దేశ వృద్ధి రేటు కంటే తెలంగాణాదే ఎక్కువ: మంత్రి హరీశ్ రావు
Telangana Budget 2023
Follow us on

సీఎం కేసీఆర్ సారాథ్యంలో తెలంగాణ ఆచ‌రిస్తుంది.. దేశం అనుస‌రిస్తోందని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం, క‌రోనావైరస్ లాంటి సంక్షోభాల‌ను త‌ట్టుకుని రాష్ట్రం అగ్రస్థానంలో నిల‌బ‌డిందన్నారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉందని.. సంక్షోభ స‌మ‌యాల్లో సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణతో ప్రపంచస్థాయిలో మన్ననలు పొందిందని మంత్రి హరిష్ పేర్కొన్నారు. సోమవారం ఆర్థిక మంత్రి హ‌రీశ్‌ రావు తెలంగాణ 2023-24 వార్షిక బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్‌ను హ‌రీశ్‌ రావు చ‌దివి వినిపించారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,90,396 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తెలంగాణలో తలసరి ఆదాయం రూ.3,17,215, మూలధన వ్యయం రూ.37,525 కోట్లుగా ప్రకటించారు. కాగా.. గతేడాది (2022-23) మార్చి 7న రూ.2.71 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గతంతో పోలిస్తే బడ్జెట్ పరిధి భారీగా పెరిగింది.

ఈ సందర్భంగా హరిశ్ రావు మాట్లాడుతూ.. 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు 11.8 శాతం నమోదు చేసి రికార్డు సృష్టించదన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని నీతి ఆయోగ్‌ నివేదికలో పేర్కొందని… తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి సంవత్సరం రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు, దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ నమోదు అవుతూ వస్తుందని తెలిపారు. 2014-15 సంవత్సరంలో దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.1 శాతం ఉండగా, 2020-21 నాటికి 4.9 శాతానికి పెరిగిందన్నారు.

దేశ జనాభాలో కేవలం 2.9 శాతం మాత్రమే తెలంగాణలో ఉండగా.. దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.9 శాతానికి కావడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే.. తెలంగాణ మెరుగైన వృద్ధి రేటు సాధిస్తుందని.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతానికి జీఎస్టీపీ సగటు వార్షిక వృద్ధి రేటుతో తెలంగాణ 3వ స్థానంలో ఉందని హరిష్ రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..