‘ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితిపై అక్కడున్న వాళ్లను అడగండి. అలాగే మీరూ అప్పుడప్పుడు అక్కడికి వెళ్తుంటారు కదా.. అక్కడికీ, ఇక్కడికీ తేడా చూడండి. తెలంగాణ అభివృద్ధి కోసం చెమట చిందించే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. ఒక దిక్కే ఓటూ పెట్టుకోండి. అదీ తెలంగాణలోనే పెట్టుకోండి’ అంటూ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే స్టీల్‌ప్లాంట్ బిడ్డింగ్‌పై ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్న నేపథ్యంలో హరీశ్ రావు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి. సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు మేడే రోజున సీఎం కేసీఆర్ శుభవార్త వినిపిస్తారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రూ.2 కోట్ల వ్యయంతో కార్మిక భవనాలను నిర్మిస్తామన్నారు. మేడే రోజున వీటికి శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా భవన నిర్మాణ కార్మిక మండలిలో సభ్యత్వం తీసుకోవాలని మంత్రి హరీశ్ సూచించారు.
‘ ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్లు ఎంతో మంది వచ్చి తెలంగాణలో స్థిరపడ్డారు. పక్కన ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన ఎలా ఉందో అక్కడి నుంచి తెలంగాణకు వచ్చి స్థిరపడిన కార్మికులకు బాగా తెలుసు. అక్కడికీ.. ఇక్కడికీ భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా (జమీన్ ఆస్మాన్ ఫరక్) ఉంది. ఏపీ, తెలంగాణ.. ఈ రెండు ప్రాంతాలనూ మీరు ప్రత్యక్షంగా చూసుంటారు. అలాగే మీరు ఎప్పుడన్నా అక్కడికి వెళ్తుంటారు కదా? అక్కడి రోడ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఎలా ఉందో చూసే ఉంటారు. మరి మీకు అక్కడ ఓటెందుకు? అక్కడ బంద్ చేసుకుని ఇక్కడ ఓటు నమోదు చేసుకోండి. మీరు కూడా మా వాళ్లే. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. కాబట్టి ఆంధ్రావోళ్లు తెలంగాణలోనే ఓటు నమోదు చేసుకోండి’ అని చెప్పుకొచ్చారు హరీశ్ రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..