Harish Rao: కాబోయే తల్లులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ల పంపిణీ షురూ..

కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం కామారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించారు. మిగతా ఎనిమిది జిల్లాల్లో స్థానిక మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Harish Rao: కాబోయే తల్లులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌ల పంపిణీ షురూ..
Harish Rao

Updated on: Dec 22, 2022 | 7:25 AM

మాతా, శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని గర్భిణీ స్త్రీల కోసం KCR కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. కేసీఆర్ న్యూట్రిషనల్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బుధవారం కామారెడ్డిలో లాంఛనంగా ప్రారంభించారు. మిగతా ఎనిమిది జిల్లాల్లో స్థానిక మంత్రులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేసీఆర్ ప్రభుత్వం తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్‌ను అందిస్తుందని హరీశ్‌ రావు పేర్కొన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పంపిణీ చేస్తున్నామని.. ఈ కిట్‌ను కాబోయే తల్లులు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు. మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్‌ ఈ కిట్‌ రూపొందించాని వెల్లడించారు. శిశువు కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్ .. కాన్పు అయ్యాక ఇచ్చేది కేసీఆర్ కిట్ అంటూ హరీష్‌ రావు వివరించారు. మాతాశిశు మరణాలు బాగా తగ్గిపోయాయని.. దేశంలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. పూర్తిస్థాయిలో టిఫా స్కానింగ్ సెంటర్లు కూడా అందుబాటులోకి రానున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

కామారెడ్డి జిల్లా కలేక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌ రావు కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ న్యూట్రిషన్‌ కిట్‌ లో ప్రొటీన్‌ డైట్‌ ఉంటుందన్నారు. ప్రతి కిట్‌ విలువ రూ.2 వేల వరకు ఉంటుందని వెల్లడించారు. ప్రతి గర్భిణికి రెండుసార్లు న్యూట్రిషన్‌ కిట్‌ అందిస్తామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ముఖ్యంగా రక్తహీనతతో బాధపడే గర్భిణుల పౌష్టికాహార స్థితిని మెరుగుపరచడమే కేసీఆర్ పోషకాహార కిట్ల లక్ష్యం. గర్భిణుల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కామారెడ్డి, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కిట్‌ల పంపిణీని ప్రారంభించారు. ఈ జిల్లాల్లో మొత్తం 1.50 లక్షల మంది గర్భిణులు కిట్‌ల ద్వారా నేరుగా లబ్ధి పొందనున్నారు. మొత్తం 2.50 లక్షల కిట్‌లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ప్రొటీన్స్‌ , మినరల్స్‌ , విటమిన్లు అధికంగా ఉండే పోషకాహారం ద్వారా రక్తహీనతను తగ్గించడం, హిమోగ్లోబిన్‌ శాతం పెంచడమే లక్ష్యంతో ఈ కిట్లను ప్రారంభించారు. మొదటి కిట్‌ను 13-27 వారాల మధ్య జరిగే రెండో ఏఎన్‌సీ సమయంలో, రెండోకిట్‌ను 28-34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్‌సీ చెకప్‌ సమయంలో గర్భిణులకు వైద్య సిబ్బంది అందించనున్నారు. తొలివిడతలో భాగంగా 9 జిల్లాల్లోని 231 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో కిట్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..