IPS వసుంధర యాదవ్.. మేడారం జాతరలో ట్రెండింగ్..

మేడారం జాతర 3వ రోజుకు చేరుకుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరకు భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. నేటితో మేడారం మహా జాతర ముగుస్తుంది. అయితే ఈ సారి జాతరలో ఓ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ బాగా ట్రెండ్ అవుతున్నారు.

IPS వసుంధర యాదవ్.. మేడారం జాతరలో ట్రెండింగ్..
Vasundhara Yadav IPS

Updated on: Jan 31, 2026 | 5:46 PM

మేడారం మహా జాతర ఇవాళ్టితో ముగుస్తుంది. వనం వీడి జనం మధ్యకు వచ్చిన వనదేవతలు మూడు రోజుల పాటు భక్తుల పూజలందుకున్నారు. తిరిగి ఈ రాత్రి వనప్రవేశంతో మేడారం మహా జాతర పరిసమాప్తం కానుంది. ఇక మేడారంలో భక్తుల రదీ కొనసాగుతోంది. తెలంగాణ కుంభమేళా అని, ఆసియాలోకెల్లా అతి పెద్ద గిరిజన జాతర అని, ఇసకేస్తే రాలనంత జనసంద్రం అని.. ఈ ఉపమానాలన్నీ ఇన్నాళ్లూ చెప్పుకోవడం వినడం వరకే. ఇప్పుడవి రియాలిటీలో కనిపిస్తున్నాయి. రెండుకళ్లూ చాలనంత దివ్యంగా ఉంది మేడారం గద్దెల ప్రాంగణం.

కాగా ఈసారి మేడారం జాతరలో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్ తన డ్యాన్స్‌తో నెట్టింట వైరల్‌గా మారారు. గిరిజన డాన్స్‌తో నెటిజన్ల మనసులు గెలుచుకున్నారు. మినిస్టర్ సీతక్క, ములుగు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అక్కడ ఉన్న మిగతా సిబ్బందితో ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఎంతో కష్టపడితే కానీ సివిల్స్ ర్యాంక్ రాదు. అదీ ఐపీఎస్ దక్కాలంటే ఎంతో పట్టుదల, క్రమశిక్షణ అవసరం. గొప్పగా చదివి, కరోఠ శిక్షణ దాటి.. బాధ్యతతో తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఈ లేడీ ఆఫీసర్ గురించి.. కొందరు మేడారం మోనాలిసా.. కాస్త దిగజారి కామెంట్స్ చేస్తున్నారు. అలాంటివారు హద్దుల్లో ఉంటే మంచిది.

ఉత్తరప్రదేశ్ కేడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ వసుంధర యాదవ్. ఆమెకు IAS అజయ్ యాదవ్ (తెలంగాణ కేడర్)తో వివాహం జరిగిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల నుంచి NOCలు వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ ఆమెను తెలంగాణకు బదిలీ చేసింది. ప్రస్తుతం వసుంధర యాదవ్ ఖమ్మం జిల్లా కల్లూరు ఏసీపీగా బాధ్యతలు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె గ్రేహౌండ్స్‌లో పనిచేసినట్లు సమాచారం.

యూపీలోని ఆజంగఢ్‌కు చెందిన వసుంధర యాదవ్.. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ చేశారు.  నాన్న ఫరూబీ యాదవ్ కల నెరవేర్చేందుకు సివిల్స్ ఎంచుకున్నారు. ఐదుసార్లు ఓటమి ఎదరైనా.. వెనక్కి తగ్గకుండా.. ఆరో ప్రయత్నంలో తన సత్తా చాటి 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణిగా నిలిచారు. ఫిబ్రవరి 2025లో ఆమెకు IAS అజయ్ యాదవ్‌తో వివాహమైంది.