AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు ఆశ చూపి.. నమ్మించి నట్టేట ముంచారు! కిలాడీ దంపతుల క్రైమ్ స్టోరీ

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామంలో భారీ మోసం వెలుగుచూసింది. అధిక వడ్డీలు ఇస్తామంటూ గౌతమ్, ప్రవళిక దంపతులు గ్రామస్థుల నుంచి సుమారు రూ.3 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు అసలు, వడ్డీ కోసం ఒత్తిడి చేయడంతో దంపతులు ఇంటికి తాళం వేసి పరారైనట్లు సమాచారం.

డబ్బు ఆశ చూపి.. నమ్మించి నట్టేట ముంచారు! కిలాడీ దంపతుల క్రైమ్ స్టోరీ
Medak News
P Shivteja
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 2:51 PM

Share

అమాయక ప్రజలను నమ్మించడమే పెట్టుబడిగా.. అమాయకత్వమే ఆసరాగా సామాన్యులను నట్టేట ముంచారు కిలాడి దంపతులు. నెలనెలా అధిక వడ్డీలు ఇస్తాం అని, మా దగ్గర డబ్బులు పెడితే మీ భవిష్యత్తు బంగారమే అంటూ కాయ కష్టం చేసి డబ్బులు కూడా బెట్టుకున్న వారిని నమ్మబలికారు. తీరా నమ్మి కోట్ల రూపాయలు చేతిలో పెట్టాక రాత్రికి రాత్రే బోర్డు తిప్పేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామంలో ఈ దారుణం వెలుగుచూసింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన గౌతమ్, ప్రవళిక అనే భార్యాభర్తలు గత కొన్నేళ్ల క్రితం చిత్రియాల గ్రామానికి వచ్చారు. ఇక్కడ ఒక కిరాణ షాప్ నడుపుతూ స్థానికులతో ఎంతో కలుపుగోలుగా ఉంటూ అందరి నమ్మకాన్ని సంపాదించారు.

తాము వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నామని, తమ వద్ద డబ్బులు దాచుకుంటే ఎక్కడా లేని విధంగా అధిక వడ్డీలు ఇస్తామని అమాయక ప్రజాలను బాగా నమ్మబలికారు. మొదట్లో కొందరికి అనుకున్న సమయానికి వడ్డీలు చెల్లించి నమ్మకం కుదిర్చారు. దాంతో గ్రామంలోని సామాన్యులు, రైతులు, మహిళలు తాము కష్టపడి దాచుకున్న సొమ్మును, భూములు అమ్మగా వచ్చిన డబ్బును నమ్మి ఈ కిలాడి దంపతుల చేతిలో పెట్టారు. ఇలా దాదాపు 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు ఈ కిలాడి దంపతులు. అమాయక ప్రజల నుండి వసూలు చేసిన కోట్ల రూపాయలతో ఈ కిలాడి దంపతులు లగ్జరీ జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. బాధితుల సొమ్ముతో హైదరాబాద్ పరిసరాల్లో విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు, భారీగా వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. అయితే రేపటి రోజున ఏవైనా లీగల్ సమస్యలు వస్తే తమ ఆస్తులు జప్తు కాకుండా ఉండేందుకు ఈ ఘరానా దంపతులు ముందే స్కెచ్ వేశారు.

తాము కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్లు, భూములను తమ పేర్లపై కాకుండా తమ కుటుంబ సభ్యుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించి సేఫ్ గేమ్‌ ఆడారు. డబ్బులు ఇచ్చిన బాధితులు కొన్ని రోజులుగా తమ వడ్డీలు, అసలు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ కిలాడి దంపతులు అసలు రంగు బయటపెట్టారు. రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా ఇంటికి తాళం వేసి, ఊరు వదిలి పరారయ్యారు. తెల్లవారి లేచి చూసేసరికి ఇల్లు ఖాళీగా ఉండటంతో బాధితులు లబోదిబోమంటూ పాపన్నపేట పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీశారు.తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు..అయితే విచారణలో మరో షాకింగ్ నిజం బయటపడింది. ఈ కిలాడి దంపతులు గతంలో నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే తరహాలో నమ్మించి సుమారు 2 కోట్ల రూపాయలతో పరార్ అయినట్టు సమాచారం అందుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us