Medak: అంగన్వాడీ కేంద్రంలో బాలమృతం బాక్స్‌ పక్కనుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా

మెదక్ జిల్లా పిలుట్ల అంగన్వాడీ కేంద్రంలో బాలామృతం దగ్గర నాగుపాము కనిపించి కలకలం రేపింది. టీచర్ విజయలక్ష్మి అప్రమత్తతతో 13 మంది చిన్నారులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పంచాయతీ సిబ్బంది వచ్చి పామును చంపేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి ..

Medak: అంగన్వాడీ కేంద్రంలో బాలమృతం బాక్స్‌ పక్కనుంచి చప్పుళ్లు.. ఏంటా అని చూడగా
Cobra

Edited By:

Updated on: Jul 26, 2025 | 3:32 PM

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిలుట్ల గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఇటీవల జరిగిన సంఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసింది. బాలామృతం బాక్స్ పక్కన ఓ నాగుపాము కనిపించడంతో అక్కడున్న చిన్నారులు భయంతో పరుగులు తీయగా.. టీచర్‌ విజయలక్ష్మి అప్రమత్తతతో ఓ పెద్ద ప్రమాదం తప్పింది. ప్రతీ రోజు లాగే 13 మంది చిన్నారులను అంగన్వాడీకి తీసుకొచ్చిన టీచర్‌.. వారిని తరగతుల్లో కూర్చోబెట్టి వంటకాలకు అవసరమైన సామాగ్రి కోసం వెళ్లింది. అదే సమయంలో బాలామృతం ఉంచిన చోట నాగుపాము కదలాడుతూ కనిపించింది. వెంటనే టీచర్‌ పిల్లలను బయటకు తీసుకెళ్లి భద్రంగా ఉంచింది. తర్వాత పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందించగా.. గ్రామపంచాయతీ సిబ్బంది హుటాహుటిన వచ్చి పామును అక్కడి నుంచి తొలగించి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా భయానక వాతావరణం నెలకొల్పింది.

ఈ వార్త తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీకి చేరుకొని తమ పిల్లలను వెంటనే ఇంటికి తీసుకెళ్లారు. గ్రామస్తులు అంగన్వాడీ పరిసరాల్లో సరైన శుభ్రత, సురక్షిత వాతావరణం కోసం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చిన్నారులే చదువుకునే కేంద్రాల్లో ఇలా పాములు చేరడం దారుణం అంటున్నారు. సంబంధిత అధికారులు ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.