నువ్వేం మగాడివిరా.. అనుమానంతో పుట్టబోయే బిడ్డకు DNA టెస్ట్ చేయాలంటూ వేధింపులు.. పాపం సుస్మిత..

కడుపులో ఉన్న బిడ్డకు డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటూ భర్త, అత్త వేధింపులకు గురిచేయడంతో ఐదు నెలల గర్భిణి సుస్మిత ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

నువ్వేం మగాడివిరా.. అనుమానంతో పుట్టబోయే బిడ్డకు DNA టెస్ట్ చేయాలంటూ వేధింపులు.. పాపం సుస్మిత..
Pregnant Woman Ends Life in Medak

Edited By:

Updated on: Jun 27, 2026 | 5:25 PM

సమాజం ఎంత ముందుకు వెళ్తున్నా.. కొందరి ఆలోచనలు మాత్రం ఇంకా దుర్మార్గంగా.. నీచంగా ఉండిపోతున్నాయి. సంకుచిత మనస్తత్వాలు, మూఢ నమ్మకాలు, నేరపూరిత ఆలోచనలు సమాజ పురోగతికి పెద్ద అడ్డంకిగా.. మాయని మచ్చగా మారుతున్నాయి. తాజాగా, ఓ భర్త కిరాతకుడిగా మారాడు.. కంటికి రెప్పలా కాపాడాల్సిన భార్యను, కడుపులో పెరుగుతున్న పురిటి బిడ్డను అనుమానించిన ఓ కిరాతక భర్త కథ తెలంగాణ సంచలనంగా మారింది. కట్టుకున్న భర్త, అత్తా కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నారు. కడుపున పుట్టబోయే బిడ్డపై అనుమానంతో ఓ భర్త, అత్త చేసిన మానసిక నరకం.. ఒక నిండు ప్రాణంతోపాటు.. కడుపున పెరుగుతున్న నలుసును కూడా కడతేర్చింది. తన కడుపున పుట్టే బిడ్డకు DNA టెస్ట్ చేయిస్తారా..? అంటూ అత్తింటి వేధింపులు తాళలేక, ఐదు నెలల గర్భిణి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దపూర్ గ్రామంలో ఈ ఘోరం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా కోటపల్లి మండలం మోత్కుపల్లి గ్రామానికి చెందిన సుస్మితకు, గడిపెద్దపూర్‌కు చెందిన గాజుల అభిలాష్‌తో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. సుస్మిత ఐదు నెలల గర్భిణి.. పుట్టబోయే బిడ్డతో ఆ ఇల్లు ఎంతో సంతోషంగా ఉండాల్సింది. కానీ, భర్త అభిలాష్, అత్త శశిరేఖల రూపంలో సుస్మితకు నరకం మొదలైంది. భార్య ప్రవర్తన పై లేనిపోని అనుమానాలు పెంచుకున్న భర్త.. కడుపులో ఉన్న శిశువు నాకు పుట్టిందేనా.. కాదా అంటూ నిత్యం రాచిరంపాన పెట్టాడు.. దానికి అత్త శశిరేఖ కూడా తోడైంది.

గర్భంలోని బిడ్డకు తండ్రి ఎవరో తేలాలంటూ.. తక్షణమే DNA పరీక్ష చేయించుకోవాలని సుస్మితను నిత్యం శారీరకంగా, మానసికంగా హింసించారు.. అమాయకురాలైన సుస్మిత అత్తింటి వేధింపులను భరిస్తూ వచ్చింది. కానీ రోజు రోజుకూ వారి అనుమానం శృతిమించిపోవడంతోపాటు కడుపులోని బిడ్డకు డిఎన్‌ఏ టెస్ట్ చేయాలంటూ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మానసికంగా, శారీరకంగా వేధించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత.. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

అటు సుస్మిత తల్లి జనబాయి మాత్రం ఇది ఆత్మహత్య కాదని.. తన కూతురిని అత్తింటివారే పక్కా ప్రణాళికతో హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న అల్లాదుర్గం ఎస్సై శంకర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి జీజీహెచ్ (GGH) ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్త అభిలాష్, అత్త శశిరేఖలపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గర్భంలోని శిశువుతో సహా ప్రాణాలు కోల్పోయిన సుస్మిత ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us