
బీజేపీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. రఘునందన్‌పై దుబ్బాక బీజేపీ నేతలు అసహానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీని కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రఘునందన్‌పై కిషన్‌రెడ్డికి ఫిర్యాదుచేయాలని డిసైడ్ అయ్యారు.
ఇంతకాలం మాంచి స్పీడ్ మీదున్న బీజేపీ.. కర్నాటక ఎన్నికల ఫలితాల తరువాత నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. ఇందుకు కారణం ఎన్నికల ఎఫెక్ట్ ఒకటైతే.. మరొకటి పార్టీలో అంతర్గత పోరు అని పొలిటికల్ సర్కిర్‌లో గుసగుసలు వినిపిస్తు్న్నాయి. కొందరు కీలక నేతలు సైతం పార్టీకి అంటిముట్టనట్లు వ్యవహరించడం, చూద్దామన్నా కనిపించకపోవడం ఈ రూమర్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
అయితే, తెలంగాణ బీజేపీలో లుకలకలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైనం ఆ పార్టీ నేతలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇటీవల దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తన అసంతృప్తిని వెళ్లగక్కడం హాట్ టాపిక్‌గా మారింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో తనకు ఎవరూ అండగా నిలవలేదని, తన ఇమేజ్‌తోనే గెలిచినట్లు తెలిపారు. అంతేకాదు.. బీజేపీ అగ్రనేతల ముఖం చూసి కాదు.. తన ముఖం చూసి ఓటర్లు ఓట్లేశారని కామెంటేశారు. అయితే, ఈ కామెంట్స్ కాస్తా కలకలం రేపడంతో.. మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయింది.
ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇటీవల సొంత పార్టీ చేసిన కామెంట్స్‌పై స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తలను, అభిమానులను నిరాశకు గురి చేసేలా ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో రఘునందన్‌కు వ్యతిరేకంగా పార్టీలోని నేతలు ఏకమయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమైన దుబ్బాక బీజేపీ నాయకులు రఘునందన్ రావుపై మండిపడ్డారు. రూ. 100 కోట్లు ఇస్తే దున్నిపడేస్తానన్న వ్యాఖ్యలు బీజేపీని కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుబ్బాక ఉప ఎన్నికలో తెలంగాణ నలుమూల నుంచీ క్యాడర్ అంతా కలిసివచ్చి, కష్టపడ్డారని.. అలాంటిది, తన మొహం చూసే ఓట్లేశారని రఘునందన్ చెప్పుకోవడం దారుణమని మండిపడ్డారు స్థానిక నేతలు. రఘునందన్ రావు పార్టీలో ఉంటే పార్టీకే నష్టమని.. ఇదే విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నారు. మొత్తంగా రఘునందన్ రావు ఇష్యూ టీ బీజేపీలో కాకరేపుతోంది. మరి దీనిపై రఘునందన్ రావు ఎలా స్పందిస్తారో.. ఆయన మనసులో ఏముందో చూడాలి?
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..