బోయగూడ అగ్ని ప్రమాదంపై ఎన్నో అనుమానాలు.. నిస్పక్షపాతంగా దర్యాప్తు జరగాలిః మర్రి శశిధర్‌రెడ్డి

|

Mar 23, 2022 | 2:05 PM

బోయగూడ అగ్ని ప్రమాద ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై జాతీయ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు

బోయగూడ అగ్ని ప్రమాదంపై ఎన్నో అనుమానాలు.. నిస్పక్షపాతంగా దర్యాప్తు జరగాలిః మర్రి శశిధర్‌రెడ్డి
Marri Shashidhar Reddy
Follow us on

Marri Shashidhar Reddy: హైదరాబాద్(Hyderabad) బోయగూడ అగ్ని ప్రమాదంలో(Boyaguda fire accident) గోడౌన్ యజమాని నిర్లక్ష్యమే 11 మందిని పొట్టనపెట్టుకుందా? అనుమతి లేని స్క్రాప్ సెంటర్స్ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయా? అంటే అవునని స్పష్టం చేస్తోంది తాజా ఘటన. నాలుగేళ్ల క్రితం ఇక్కడి నుంచి తరలించాలని అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా.. కదలిక లేదు. యదేచ్ఛగా సాగుతున్న స్క్రాప్ బిజినెస్ బీహార్ కార్మికుల(Bihar Migrates)ను బలిగొన్నది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై జాతీయ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు.

బోయిగూడ అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి కలచివేసిందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ లో పని చేశానని, ప్రమాదం జరిగిన తీరు అనుమానాలకు తావిస్తుందన్నారు. ప్రమాదానికి కారణాలు ఏంటో తెలుసుకొని.. మరోచోట ఇలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బోయగూడ ప్రమాదానికి గురైన స్థలాన్ని కొద్దిరోజులుగా వివాదం నడుస్తోందన్నారు. కొందరు వ్యక్తులు ఈ స్థలాన్ని అమ్మాలని యజమానిపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇదే గోడౌన్‌లో ఒకసారి సిలిండర్ పేలి ప్రమాదం జరిగిందని ఆయన గుర్తు చేశారు. గతంలో మరోసారి షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంటున్నారు.. దీన్ని బట్టి చూస్తే, ఉద్దేశ్యపూర్వకంగానే గోడౌన్‌కు నిప్పు పెట్టి ఉంటారని అనుమానంగా ఉందని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన అధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవాలన్నారు. ఇక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను అంతా భద్రపరచాలన్నారు. అంతేకాదు, స్థానిక పోలీసులపై కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ కమిషనర్, డీజీపీ, హోం మంత్రి, రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతానని శశిధర్ రెడ్డి తెలిపారు.

ఇదిలావుంటే, 11మంది కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయి. పొట్టచేత పట్టుకొని హైదరాబాద్ బాట పట్టిన తమ వారు.. చేతి నిండా డబ్బులతో తిరిగొస్తారని బీహార్‌లో ఉంటున్న కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కాని మంగళవారం అర్ధరాత్రి.. కాళరాత్రిగా మారింది. యజమాని నిర్లక్ష్యమే వారిని పొట్టన పెట్టుకుందా? అధికారులు దాడులు చేయకపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందా? సరైన ప్రికాషన్స్‌ తీసుకొని ఉంటే కార్మికుల ప్రాణాలు నిలబడేవా? అంటే అవుననే సమాధానం వస్తుంది. గోడౌన్ యజమాని, అధికారుల నిర్లక్ష్యం కార్మికుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది.

ప్రమాదం జరిగిన గోడౌన్‌ కేబుల్స్, ప్లాస్టిక్ బాటిల్స్‌తో నిండిపోయింది. అందుకే కొద్ది మంటలు క్షణాల్లో విస్తరించాయి. వాస్తవానికి గోడౌన్‌కు అనుమతి లేదు. ఇలాంటి గోడౌన్స్ ఆ ప్రాంతంలో 20 వరకు ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ప్రమాదంతోనైనా అధికారులు కదులుతారా అన్న ప్రశ్న స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు కూత వేటు దూరంలో జనావాసాల మధ్య అగ్నిగుండాలు అనేకం ఉన్నాయి. చిన్న నిప్పు రవ్వ అంటుకున్నా క్షణాల్లో అగ్నికీలలు ఎగిసిపడుతాయి. ఇవాళ ఉదయం జరిగింది కూడా ఇదే. దీనిని ఇక్కడి నుంచి తరలించాలని నాలుగేళ్ల క్రితం స్థానికులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల నుంచి కదలిక లేదు. ఫలితంగా 11 మంది బీహారీ కార్మికుల ప్రాణాలు గాల్లో కలిశాయి.

ఎంత నిర్లక్ష్యం.. ఎంత నిర్లక్ష్యం.. అనుమతులు లేకుండా ప్రమాదం జరిగిన చోట 20 గోడౌన్స్‌ రన్ అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత అయిన మిగతా 19 గోడౌన్స్‌కు తాళాలు వేస్తారా? ప్రమాదం జరిగినప్పుడే హడావుడి చేసి వదిలేస్తారా? ఇప్పటికైనా బోయిగూడ స్క్రాప్‌ ఇండస్ట్రీని మొత్తం మార్చేస్తారా? ఘటనపై విచారణకు ఆదేశిస్తామంటున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అయితే ఘటన జరగడానికి ముందే మేల్కొని ఉంటే.. ఇంత దారుణం జరిగేదా? అంటూ సగటు హైదరాబాదీ ప్రశ్నిస్తున్నారు.