Sangareddy: పండగ పూట ఇదేం పనిరా.. అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు

భార్యాభర్తల మధ్య గొడవలు హద్దులు దాటుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి రమ్మని పిలిచిన భర్తకు నిరాకరణ ఎదురవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఏకంగా అత్తారింటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.

Sangareddy: పండగ పూట ఇదేం పనిరా.. అత్తారింటికి నిప్పు పెట్టిన అల్లుడు
In Laws House Fire

Edited By:

Updated on: Jan 16, 2026 | 8:36 PM

భార్యా భర్తల మధ్య గొడవలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. సహనం మరిచిపోయి వ్యవహరిస్తున్నారు కొంతమంది. అలిగి పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి రమ్మని పిలిచాడు ఓ భర్త. కానీ అందుకు భార్యతో పాటు ఆమె తల్లి తండ్రులు ఒప్పుకోకపోవడంతో
ఆగ్రహంతో ఊగిపోయిన అల్లుడు. ఏకంగా అత్తారింటికే నిప్పు పెట్టేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా నిజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నిజాంపేట గ్రామానికి చెందిన పిట్లం బాలయ్య కూతురు సాయవ్వకి, రవి అనే వ్యక్తితో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మత్తుకు బానిస అయిన రవి నిత్యం మద్యం తాగుతూ భార్య సాయవ్వతో గొడవలు పడుతున్నాడు. ఈ విషయంలోనే గత కొద్ది రోజులుగా మనస్పర్థలు రావడంతో భార్య అలిగి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కాగా ఇదే విషయంలో పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా ఫలితం లేకపోయింది. గురువారం రాత్రి అత్తారింటికి వెళ్లిన అల్లుడు రవి.. తన భార్యను వెంటనే తనతో పంపాలని అత్త మామలతో గొడవకు దిగాడు. కానీ కూతుర్ని రవితో పంపడానికి అత్తమామలు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రవి.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇంటి పై పోసి నిప్పు పెట్టాడు. దీనితో అక్కడే ఉన్న బైక్ కూడా పూర్తిగా తగలబడి పోయింది. మంటలు ఎక్కువగా రావడంతో ఇంట్లో ఉన్నవాళ్ళు వెంటనే ఇంటి వెనుక ఉన్న డోర్ ద్వారా బయటకు వెళ్ళిపోయారు. దీనితో పెద్ద ఎత్తున్న ప్రమాదం తప్పింది. ఘటన అనంతరం రవి అక్కడి నుండి పరారయ్యాడు… బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.