16 నెలల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో కొత్తగూడెం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పోక్సో కేసులో దోషికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని లేని పక్షంలో ఆరు నెలల కఠిన కారాగార శిక్ష అదనంగా ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి భద్రాచలం ఏఏస్పీ, ప్రస్తుత టీఎస్‌ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపీఎస్ గారు స్వయంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. నిందితుడికి శిక్ష పడేలా కేసులో ఆధారాలను సేకరించారు. కోర్టు త్వరితగతిన ట్రయల్ నిర్వహించేలా చొరవచూపారు.
2018 జూన్‌లో భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలానికి చెందిన 22 ఏళ్ల అజ్మీరా సాయికిరణ్ అనే వ్యక్తి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ పాప తల్లిదండ్రులు శుభకార్యం కోసం వేరే ఊరు వెళ్లగా, అప్పుడు వారి బంధువు వద్ద ఉన్న పాపను ఆడిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై దుమ్ముగూడెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది.
చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష పడేలా పకడ్బందీగా కేసును దర్యాప్తు చేసిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అభినందించారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో గురువారం ఆయనను సన్మానించారు. బాధిత కుటుంబానికి వేగంగా న్యాయం అందేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను ప్రశంసించారు. కెరిర్ ప్రారంభంలోనే పొక్సో కేసులో పక్కా సాక్ష్యాధారాలను సేకరించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని కొనియాడారు. పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడటమనేది ప్రస్తుతం ఒక సవాల్‌గా మారిందన్నారు. కానీ.. దుమ్ముగూడెం కేసులో నిందితుడికి 25 ఏళ్ల శిక్ష ఖరారు కావడం చారిత్రాత్మకమన్నారు.
“పిల్లలు సమాజ ఆస్తి. వారిని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉంది. చిన్నారులను స్వేచ్ఛగా ఎదిగేందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తూనే.. వారికి గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. పిల్లలకు రక్షణ ఛత్రంగా ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలి. పోక్సో కేసులనూ సీరియస్‌గా తీసుకుని కోర్టుల్లో వేగంగా ట్రయల్ జరిగేలా చూడాలి. తన వంతు బాధ్యతగా పొక్సో కేసులో నిందితుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకున్న సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ చొరవ ప్రశంసనీయం.” అని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ గారు అన్నారు. ప్రతి ఒక్కరూ చిన్నారులపై జరుగుతున్న నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు పాటుపడాలన్నారు.
చిన్నారిపై అత్యాచార కేసులో నేరస్తుడికి 25 ఏళ్ల జైళ్ల శిక్ష ఖరారు కావడంపై టీఎస్‌ఆర్టీసీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఐపీఎస్ సంతోషం వ్యక్తం చేశారు. తన మొదటి సంచలన కేసులోనే చారిత్రాత్మక తీర్పు రావడం సంతోషంగా ఉందన్నారు. తనను అభినందించి సన్మానించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఆర్టీసీ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కేసులో తన వృత్తి ధర్మాన్ని నిర్వహించానని, ఈ అనుభవంతో భవిష్యత్‌లో మరింత సమర్థవంతంగా పనిచేస్తానని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు సహకరించిన సీఐ బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుళ్లు ఎండీ ముజామిల్, రాజేంద్ర కుమార్, హరిగోపాల్, కానిస్టేబుల్ హనుమంతరావు, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మిలను అభినందించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..