Hyderabad City: హైదరాబాద్ పాతబస్తీ లోని షహజాన్కాలనీ మదర్సాలో దారుణం చోటు చేసుకుంది. 6, 8 సంవత్సరాల బాలురపై మదర్సా నిర్వాహకుడి పిల్లలు అత్యంత పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. గోళ్లతో రక్కి.. చేతులు, కట్టెలతో చితక బాదారు. వీరి దాడికి పిల్లలు భీతిల్లిపోయారు. ఒంటి నిండా వాతలతో విద్యార్థుల ఒళ్లంతా హూనం అయ్యింది. అయితే, తాజాగా పిల్లలను చూడటానికి వారి తండ్రి రాగా.. అతన్ని పట్టుకుని బోరున విలపించారు పిల్లలు. వారి ఒంటిపై గాయాలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. మదర్సా నిర్వహకులపై బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కరోనా కారణంగా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను అరబ్బి భాష నేర్పించడానికి మదర్సాలలో చేర్పించారు ఆ తల్లిదండ్రులు. అయితే, నిర్వాహకులు అరబ్బి భాష నేర్పించడం పక్కన పెడితే.. పిల్లలను చిత్ర హింసలకు గురి చేశారు. మదర్సా నిర్వాహకుని పిల్లలు.. 6, 8 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలపై పైశాచిక దాడి చేశారు. ముఖాలపై, చేతులపై గోళ్లతో రక్కారు. ఇష్టం వచ్చినట్టు కొట్టారు. కర్రలతో చెప్పరాని చోట్ల వాతలు వచ్చేటట్టు చితకబాదారు. వీరి చిత్రహింసల గురించి ఎవరికీ చెప్పుకోలేక.. ఏడవ లేక.. ఆ ఇద్దరు చిన్నారులు లోలోనే కుమిలిపోయారు. ఎట్టకేలకు 45 రోజుల తర్వాత తన పిల్లలు ఎలా ఉన్నారో చూడడానికి వచ్చిన తండ్రికి మదర్సా నిర్వాహకం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బాలాపూర్పోలీస్ స్టేషన్‌పరిధిలో తీవ్ర కలకలం రేపింది.
చాంద్రాయణగుట్ట యాబా స్విమ్మింగ్‌ఫూల్ ప్రాంతానికి చెందిన మతిన్ బిన్ జావిద్ అల్ జాబ్రి వృత్తి రిత్యా ప్రైవేట్ ఉద్యోగి. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఉస్మాన్బిన్ మతిన్అల్జాబ్రి(8), చిన్నకుమారుడు హసన్బిబ్మతీన్అల్జాబ్రీ(6)లు. కరోనా కారణంగా పాఠశాలలు మూసి వేయడంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. కనీసం అరబ్బి భాషలోనైనా పట్టు సాధిస్తారని తన ఇద్దరు కుమారులను అరబ్బి భాష నేర్చుకోవడానికి షహజాన్ కాలనీలోని బెహరుల్ఉలుమ్ మదర్సాలో గత 45 రోజలు క్రితం చేర్పించాడు. మదర్సాలో చేర్చిన తన పిల్లలను చూడటానికి మతిన్ బిన్ జావిద్అల్జాబ్రి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అయితే, ఆ చిన్నారులు తమ తండ్రిని చూడగానే బోరున విలపించారు. ఎందుకు ఏడుస్తున్నారు అని ఆరా తీయగా.. అసలు విషయం చెప్పారు. దాంతో జావిద్ తన పిల్లలను తీసుకువెళ్లి బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బాలపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read:
Telangana Collectors: తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు.. హైదరాబాద్ కలెక్టర్‌గా ఎల్. శర్మన్..