రాగల 24 గంటల్లో జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగ్లాదేశ్ పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ సముద్రమట్టం నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని పేర్కొన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 8 వరకు వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాల్‌పల్లి, ములుగు, భదాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఇప్పటికే, హైదరాబాద్ నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం పడింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. నిజాంపేట, ప్రగతినగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, కిస్మత్‌పురా, బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్, గండిపేట్‌లో వాన కురిసింది. బేగంబజార్, ఏంజే మార్కెట్, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, నారాయణగూడ, లిబర్టీ పరిసర ప్రాంతాల్లో వానపడింది. పలుచోట్ల ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షం కురిసింది. మరోవైపు, నాగర్ కర్నూల్, వనపర్తి మినహా అన్ని జిల్లాలో వర్షం కురిసినట్లు టీఎస్ డీపీఎస్ తెలిపింది. 20కిపైగా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాపాతం నమోదైంది.